ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెకి కేంద్ర ప్రభుత్వం అవార్డు వచ్చింది. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు కింద రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామం ఏడాదిలో సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకుని స్కోచ్ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం. పీఎం సూర్యఘర్ పథకం కింద నారావారిపల్లెలో 1600 ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో అధికారులు పూర్తి చేశారు. కేవలం ఏడాదిలోనే సీఎం సొంత ఊరు పూర్తిగా సోలార్ విలేజ్ గా మారి ఘనత చాటుకుంది. దీంతో స్కోచ్ అవార్డుకు ఎంపిక చేసి శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అధికారులకు ప్రదానం చేశారు.
‘స్వర్ణ నారావారిపల్లె’ ప్రాజెక్టులో భాగంగా తన స్వగ్రామానికి స్కోచ్ అవార్డు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం ప్రకటించారు. అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. సౌరశక్తితో 1,600 కుటుంబాలకు విద్యుత్‌ను అందిస్తూ, సంవత్సరానికి 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారని సీఎం కొనియాడారు. అదేవిధంగా ఏడాదికి, 1.92 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుస్థిరమైన హరిత స్వర్ణాంధ్రకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చంద్రబాబు కొనియాడారు.
ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీ ఉన్న నారావారిపల్లెను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వర్ణాంధ్ర – 2047లో భాగంగా తన స్వగ్రామాన్ని స్వర్ణ నారావారిపల్లెగా తీర్చిదిద్దాలని భావించారు. దీంతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘స్వర్ణ నారావారిపల్లె’ ప్రాజెక్టుకు అంకారార్పణ చేశారు. ఈ గ్రామంలో గతంలోనే టీటీడీ కల్యాణ మండపం, కమ్యూనిటీ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు కింద గ్రామంలో అందరికి పక్కా ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం సూచనలతో కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించారు.
సీఎం సూచనలతో స్వర్ణ నారావారిపల్లె సమగ్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది. చంద్రగిరి మండలం కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్నరామాపురం పంచాయతీల పరిధిలోని 31 గ్రామాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. క్లస్టర్ పరిధిలో 2,007 ఇళ్లు ఉండగా, 2,160 కుటుంబాలకు చెందిన 5,960 మంది జనాభా ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కుటుంబాల అవసరాలు తీర్చేందుకూ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ 2,160 కుటుంబాల్లో 1,830 కుటుంబాలకు సొంత ఇళ్లున్నాయి. 286 కుటుంబాలకు లేవని గుర్తించగా నిబంధనల రీత్యా అర్హత కలిగిన 242 కుటుంబాలకు పీఎంఏవై కింద పక్కా గృహాలు మంజూరు చేశారు. వచ్చే ఏడాది మార్చిలోగా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి అప్పగిస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేని 35 కుటుంబాలకు కొద్ది రోజుల్లో వాటిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్లస్టర్ పరిధిలో 1,202 మందికి వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయి. 137 మంది అర్హులకు మంజూరు కాలేదని గుర్తించారు. 97 మందికి ఇప్పటికే పెన్షన్లు మంజూరు చేశారు. మిగిలిన వారికీ త్వరలో ఇచ్చే ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్లస్టర్ పరిధిలో 87 కుటుంబాలకు తాగునీటి కొళాయి కనెక్షన్లు లేవని సర్వేలో గుర్తించారు. వాటిలో ఇప్పటికే 20 కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వగా.. మిగిలిన వారికి సెప్టెంబరులోపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 286 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని తేలగా వారందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఇలా సీఎం స్వగ్రామం నారావారిపల్లెతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కనీస వసతులు, సోలార్ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు.