తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చర్చకు వచ్చింది. ఈ భూముల్లో చెట్లను అనుమతుల్లేకుండానే నరికి వేసినట్టు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులపై జైలు శిక్షలూ తప్పవని ధర్మాసనం హెచ్చరించింది.
బుధవారం జరిగిన విచారణలో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ, చెట్లు తొలగించడానికి ముందుగా అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అనుమతులు తీసుకున్నామని, వాల్టా చట్టం ప్రకారం అన్ని ప్రక్రియలు పాటించామని తెలిపారు.
అయితే, కోర్టు దృష్టికి అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక ప్రకారం భూములను రూ.10వేల కోట్లకు మార్టిగేజ్ చేసినట్టు పేర్కొన్నా, జస్టిస్ గవాయి స్పష్టంగా చెప్పిన సంగతి.. తమకు భూముల విలువకంటే చెట్ల నరికివేతకు సంబంధించిన అనుమతులే ముఖ్యం. ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత కావాలని ధర్మాసనం పేర్కొంది.
చివరగా, ప్రస్తుతం స్థితిగతులు అలాగే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇచ్చే సమయం దొరికినట్టే. కానీ అనుమతుల విషయంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, అధికారి స్థాయిలో తగిన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసిన విధానం తీవ్రతను చూపిస్తోంది.