ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. భారత తయారీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని మనం సంకల్పించుకుందామని అన్నారు. అంటే.. బ్రాండ్, తయారీ సంస్థతో సంబంధం లేకుండా.. మన భారతీయుల స్వేదం, శ్రమతో తయారైన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి, అమ్మాలి, వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో… మన దేశ చేతివృత్తులవారు, కార్మికులు, పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రతిసారి, అనేక కుటుంబాలు జీవనోపాది సంపాదించడానికి సహాయం చేస్తున్నారని.. మన యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నారని.. అందుకే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను విక్రయించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ… పట్టణాల సంగతి కాసేపు పక్కన పెడితే గ్రామాల్లో కూడా విదేశీ వస్తువులే దర్శనమిస్తున్నాయనే చర్చ బలంగా నడుస్తుంది. ఇక సూపర్ మార్కెట్స్ విషయానికొస్తే అక్కడున్న వస్తువుల్లో ఏది స్వదేశీ, ఏది విదేశీ అనేది గుర్తించడం అందరివల్లా కాకపోవచ్చు. ఇక షాపింగ్ మాల్స్ లో దుస్తుల సంగతి చెప్పేపనేలేదు.
నగరాల్లో ఎన్నో షాపింగ్ మాల్స్ లో విదేశీ దుస్తుల ప్రత్యేక షాపులు ఉంటాయి. వాటిని ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. పైగా వాటిపై “మేడ్ ఇన్” అనేది గుర్తించడం కష్టం. ఈ నేపథ్యంలో… స్వదేశీ వస్తువులను గుర్తించడానికి ప్రత్యేకంగా ఏదైనా లేబుల్స్ ప్రింట్ చేయించాలని నెటిజన్లు కోరుతున్నారు. తద్వారా విదేశీ వస్తువుల మధ్య దాగున్న స్వదేశీ వస్తువులను గుర్తించడం సులభమవుతుందని అంటున్నారు.