టాలీవుడ్‌లో రాజమౌళి స్థాయి దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో సుకుమార్ పేరు ముందు వరుసలో ఉంటుంది. రాజమౌళి సైతం తన అభిమాన దర్శకుడు సుకుమార్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సుకుమార్ ఏ సినిమా తీసినా.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో రాజమౌళి ఏదో ఒక సమయంలో, సందర్భంలో కనిపిస్తూనే ఉంటారు. అంతటి గొప్ప పేరును, స్టార్‌డంను దక్కించుకున్న సుకుమార్ పుష్ప 2 సినిమా తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో దాదాపుగా రూ.1800 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న సుకుమార్ తదుపరి సినిమా విషయంలో ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పుష్ప 2 సినిమా విడుదల అయ్యి ఆరు నెలలు దాటింది. ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమాకు సంబంధించిన కెమెరా స్విచ్ ఆన్ చేయలేదు. కానీ రామ్ చరణ్‌తో సుకుమార్ కొత్త సినిమా చేయబోతున్నాడు అనే అధికారిక ప్రకటన వచ్చింది, అంతే కాకుండా ఆ సినిమా కోసం టైం ఎక్కువ తీసుకుని స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ అనగానే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ మూవీ ప్రారంభంకు ఎలాగూ ఇంకా దాదాపుగా ఆరు నెలల సమయం ఉంది. కనుక సుకుమార్ హాలీడే మూడ్‌లో ఉన్నాడు. గత కొన్నాళ్లుగా లండన్‌లో జరుగుతున్న పలు కార్యక్రమాలకు హాజరు అవుతున్న సుకుమార్ తాజాగా అక్కడ జరుగుతున్న వింబుల్డన్ 2025 ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు గాను సతీ సమేతంగా స్టేడియంకు వెళ్లాడు. అక్కడ సుకుమార్ దంపతులు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప రెండు పార్ట్‌ల కోసం దాదాపుగా మూడు ఏళ్ల పాటు నిర్విరామంగా సుకుమార్ కష్టపడ్డాడు. అందుకే ఆయన ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరం అని ఆయన సన్నిహితులు, అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంతంగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడం ద్వారా సుకుమార్ మరో రంగస్థలం, పుష్ప వంటి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. గడచిన పదేళ్ల కాలంలో సుకుమార్ నుంచి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇకపై అయినా ఆయన వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2004 సంవత్సరంలో ఆర్య సినిమాతో సుకుమార్ టాలీవుడ్‌లో దర్శకుడిగా అడుగు పెట్టిన విషయం తెల్సిందే. రెండు దశాబ్దాలు దాటినప్పటికీ సుకుమార్ ఇప్పటి వరకు కేవలం 9 సినిమాలు మాత్రమే చేశాడు. రెండేళ్లకు కనీసం ఒక్క సినిమాను కూడా సుకుమార్ తీసుకు రాలేక పోతున్నాడు. సుకుమార్ వంటి ప్రతిభావంతుడు అయిన దర్శకుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు, అభిమానులు కోరుకుంటున్నారు.