కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న తెలుగు యువతి హత్యకు గురైంది. ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవశ్రీ(21) ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ నాలుగో సంవత్సరం కళాశాలలో చదువుతోంది.
స్థానికంగా అక్కడే ఓ అద్దె గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండమర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఏమైందో కానీ ఆమె గదిలో గాయాలతో విగత జీవిగా పడి ఉంది
స్నేహితుడైన ప్రేమవర్ధన్ ఆమె తలపై కొట్టి హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవశ్రీ హత్యకు గురైన సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు. వెంటనే వారు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందన్న కుమార్తె హత్యకు గురికావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు.

















