జూనియర్లు తప్పు చేశారంటే మందలించొచ్చు. మార్గంలో పెట్టుకోవచ్చు. సీనియర్లు, సీనియర్ మోస్టులు కూడా ఇదే బాటలో నడిస్తే.. ? ఏం చేయాలి? ప్రభుత్వానికి కొమ్ము కాయాల్సిన నాయకులు.. ప్రభుత్వం తరఫున గళం వినిపించాల్సిన నాయకులు కూడా దారి తప్పి.. మంది కోసం మెహర్బానీకిపోతే.. ఎవరు మాత్రం ప్రశ్నించాలి?.. ఇదీ టీడీపీలో జరుగుతున్న చర్చ. ఇప్పటికే కొత్త తరం ఎమ్మెల్యేల దూకుడు, సీనియర్ల వాదనలు .. వంటివి పార్టీని సంకటస్థితిలోకి నెట్టేస్తున్నాయి.
వైసీపీపై విమర్శలు చేస్తున్న పరిస్థితి నుంచి తమపై విమర్శలు చేయించుకునే స్థాయికి నాయకులు దిగు తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇది ఎంత వరకు సమంజసం? అనేది ప్రధాన ప్రశ్న. తాజాగా వెలుగులోకి వచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడి వీడియో.. అనేక ప్రశ్నలకు.. వివాదాలకు కూడా ఆస్కారం ఇచ్చింది. స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధమైన హోదా. రాజ్యాంగంలో దీనికి పెద్ద ఎత్తున ప్లేస్ ఇచ్చారు. ఇక, ఇప్పటి వరకు విభజిత ఏపీకి ప్రాధాన్యం వహించిన స్పీకర్లు కూడా.. వివాదాలకు అతీతంగానే ఉన్నారు.
కోడెల శివప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఇద్దరూ కూడా.. స్పీకర్ పదవికి వన్నె తీసుకువచ్చినా.. తీసు కురాలేక పోయినా.. కొత్త తరహా.. వివాదాలకు దూరంగానే ఉన్నారని చెప్పాలి. అయితే.. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఉన్న అయ్యన్న కొత్త వివాదానికి.. నోటి దురుసు వ్యవహారానికి కూడా కేంద్రంగా మారిపోయారు. ఇది సమంజసమా? అనేది ప్రశ్న. పార్టీ నేతలు.. సీనియర్లు ప్రభుత్వానికి, పార్టీకి కూడా మేలు చేసేలా వ్యవహరించాలని చంద్రబాబు గొంతు చించుకున్న 24 గంటల లోపే.. అయ్యన్న నోటి దురుసు వీడియో వెలుగు చూసింది.
మరి దీనిపై ఆయన ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. నకిలీ వీడియో అని, వైసీపీ సృష్టించిందని కామన్‌గా ఓ రాయి వేసేసి.. తప్పించుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ, ఇప్పుడు ససాక్ష్యంగా సోషల్ మీడియాలోనే ఇది వైరల్ అయింది. దీనికి వివరణలతో పనికూడా ఉండకపోవచ్చు. కానీ, పార్టీ పరంగా చూసుకుంటే.. ఎలా ఉన్నా, ఆయనకు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ, స్పీకర్ పదవికి, పార్టీలో ఆయనకు ఉన్న సీనియారిటీ సరైందేనా? అని ప్రశ్నించుకుంటే మాత్రం.. చంద్రబాబుకు మరో తలనొప్పి తెచ్చారన్న తమ్ముళ్ల వాదనే అర్ధవంతంగా ఉంటుంది. ఇకనైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.