ఏపీలో రాజకీయం టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా మారింది అన్నది తెలిసిందే. ఉప్పు నిప్పులా రాజకీయం సాగుతోంది. ఇక గత కొన్నాళ్ళుగా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఏకంగా అక్కడే పొలిటికల్ వార్ కి రాజకీయ పార్టీలు తెర తీశాయి. మరీ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ వర్సెస్ టీడీపీ సోషల్ మీడియా యుద్ధం నిత్యం సాగుతుంది. వారు ఒకటి పోస్ట్ చేస్తే ఇటు నుంచి రెండు వెళ్ళేలా వార్ ఎపుడూ జెట్ స్పీడ్ తో సాగుతూంటుంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వార్ కి చెక్ పెట్టేలా ఏపీలో కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా పోస్టుల తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు. ఇంకో వైపు చూస్తే హోం మంత్రి అనిత కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక విశాఖ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీని మీద కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అందులో హోం మంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తదితరులు ఉంటారు. ఈ మంత్రి వర్గ ఉప సంఘం మొత్తం అధ్యయనం చేసి సమగ్రమైన చట్టం తీసుకుని రావడానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది అని కూటమి పెద్దలు ప్రతీ సారీ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రతీ సారి తప్పుడు సమాచారాన్ని జనాలకు చేర వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. అమరావతి రాజధాని నుంచి మొదలుపెడితే రైతుల సమస్యల దాకా అన్నీ కూడా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని వైసీపీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది అన్నారు. తాము ప్రజా సమస్యల గురించే ఆలోచించాలా లేక వీటికే వివరణ ఇచ్చుకుంటూ కూర్చోవాలా అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చే చట్టం ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా ఉండాలని అంతా కోరుకున్నారు. సోషల్ మీడియా ఉంది కదా అని వ్యక్తిత్వ హననం చేస్తున్న వారికి కూడా తగిన శిక్ష ఉంటుందని చెప్పేలా చట్టం పదునుగా పనిచేస్తే కనుక రాజకీయ కక్షలు కార్పణ్యాలతో పాటు చాలా మటుకు అన్ని విషయాల మీద ప్రశాంతత వస్తుందని అనుకూల వాతావరణం ఉంటుందని మేధావులు అంటున్నారు. సోషల్ మీడియా ఒక పదునైన ఆయుధం దానిని మంచి కోసం వాడేలా చూడడానికి ఈ తరహా చట్టాలు ఉపయోగపడాల్సి ఉంది అని అంటున్నారు