మూడు రాజధానులు అంటూ అయిదేళ్ళ తమ పదవీ కాలంలో వైసీపీ చాలా పెద్ద ఎత్తున పలవరించింది అమరావతిని శాసన రాజధానిగానూ విశాఖను కార్యనిర్వాహక రాజధనిగానూ కర్నూలు ని న్యాయ రాజధానిగానూ నిర్వచించింది. ఈ విధంగా చేయడం వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుందని అభివృద్ధి కూడా మూడు ప్రాంతాలలో సమానంగా ఉంటుందని చెబుతూ వచ్చింది. అయితే జగన్ మూడు రాజధాని ఫిలాసఫీ తప్పు అని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ అసలు వికేంద్రీకరణ అంటే ఏమిటో ఆయన కొత్త అర్ధం చెప్పారు.
ఈ మధ్య కాలంలో మరో ప్రచారం కూడా వస్తోంది. ఇపుడు అమరావతిని రాజధానిగా చేసిన రేపు మళ్ళీ వైసీపీ వస్తే మూడు రాజధానులు అని అంటే ఆ సంగతేంటి అన్న ప్రశ్నలు కూడా వినవచ్చాయి. దానికి బదులు అన్నట్లుగా లోకేష్ విశాఖ పర్యటనలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ఒకే ఒక రాజధాని ఉంటుంది. అది అమరావతి అని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానులు ఉండవని ఆయన కీలకమైన సంకేతాలనే ఏపీ వ్యాప్తంగా పంపించారు. అది కూడా విశాఖను ఒక రాజధానిగా వైసీపీ ప్రతిపాదించిన చోట నుంచే మాట్లాడుతూ స్పష్టం చేశారు.
వైసీపీ ఎంత సేపూ వికేంద్రీకరణ అంటూ మాట్లాడేది. దానికి సరైన జవాబు అన్నట్లుగా లోకేష్ చెప్పారు. వికేంద్రీకరణ అంటే రాజధానులను మూడు నాలుగు చేయడం కాదు అన్నట్లుగా అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ మంత్రం అదే తమ విధానం అని ఆయన చెప్పారు. ఏపీలో ప్రతీ జిల్లాను అభివృద్ధి చేస్తామని అన్నారు. అంటే ప్రతీ జిల్లాకూ ఒక రాజసాన్ని రాజధాని కళను తెస్తామని లోకేష్ చెప్పారన్న మాట. అంతే కాదు ప్రాంతాల వారీగా ఆయా చోట్ల అవసరమైన అభివృద్ధిని అక్కడ ఉన్న స్థానిక వనరులకు తగిన విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన వివరిస్తున్నారు. ఉత్తరాంధ్రాని ఐటీ పరంగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని లోకేష్ చెప్పారు. రాయలసీమలోని అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ప్రకాశం జిల్లాలో సిబిజి, గుంటూరు కృష్ణా జిల్లాలో క్వాంటమ్ వ్యాలీ, గోదావరి జిల్లాల్లో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఐటి, ఫార్మా, లాజిస్టిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యత నిస్తున్నామని ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే విశాఖ గురించి ప్రత్యేకంగా లోకేష్ ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో కష్టకాలంలో కూడా మమ్మల్ని విశాఖ ప్రజలు ఆదరించి నలుగురు శాసనసభ్యులను గెలిపించారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. అందువల్ల రాబోయే నాలుగేళ్లలో విశాఖ నగరం రూపురేఖలు మార్చేసి మీ రుణం తీర్చుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పడం విశేషం.