శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా రూపొందిన మూవీ `సింగిల్`(#Single). కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ సంయుక్తంగా నిర్మించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా చేసుకొని రూపొంది ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 9)న విడుదలైంది. కామెడీ చిత్రాలతో అలరించే శ్రీవిష్ణు ఈ సినిమాతో ఆడియెన్స్ ని అలరించారా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
విజయ్(శ్రీవిష్ణు) బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు అరవింద్(వెన్నెల కిశోర్) ఫ్రెండ్. వీరిద్దరు చిన్నప్పట్నుంచి అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు, కానీ ఎవరూ వీరి ప్రేమని అంగీకరించరు. ఎలాగైనా అమ్మాయిలను పడేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు. దీంతో ఉద్యోగం చేసే స్థాయికి వచ్చినా సింగిల్‌గానే ఉంటారు.ఈ క్రమంలో విజయ్‌కి పూర్వ(కేతిక శర్మ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడతాడు విజయ్. ఆమెని తన ప్రేమలో పడేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో డాన్స్ టీచర్ హరిణి(ఇవానా) విజయ్‌ని ప్రేమిస్తుంది. ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది.కానీ విజయ్ మాత్రం పూర్వపై ఫోకస్ పెడతాడు. మరి వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది. విజయ్‌కి పూర్వ పడిందా? హరిణికి విజయ్ పడ్డాడా? లేక సింగిల్‌గానే మిగిలిపోయాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`యాష్ ట్యాగ్ సింగిల్`(#Single) మూవీ కథ పరంగా చాలా సింపుల్. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరు లవర్స్ తో హీరో ఎలా ఇబ్బంది పడ్డాడు? వారిని ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ క్రమంలో పుట్టే కామెడీనే ఈ చిత్రం. స్టోరీ సింపుల్‌గానే ఉండటంతో మెయిన్‌గా కామెడీనే నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.సందర్భానుసారంగా పుట్టే కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇటీవల వచ్చిన చాలా చిత్రాలు ఇలానే విజయాలు అందుకున్నాయి. ఆ కోవలోనే `సింగిల్` మూవీని రూపొందించారు. లాజిక్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ని రెండున్నర గంటలపాటు నవ్విస్తే చాలు సినిమా థియేటర్లలో రచ్చ చేస్తుంటుంది. ఈ మూవీ విషయంలో అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.
సినిమా ప్రారంభం నుంచే కామెడీ వర్కౌట్ అయ్యేలా చేశారు. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ ల మధ్య కామెడీ ట్రాక్‌ని బలంగా రాసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య సీన్లు అంతే బాగా వర్కౌట్ అయ్యాయి. వీరి సీన్లు ఎప్పుడు వచ్చినా హిలేరియస్‌గా నవ్వులు పూయిస్తుంది.ఇక అమ్మాయిల విషయంలో హీరో చేసే పొరపాట్లు, తొందరపాట్లు, ఈ క్రమంలో కొందరు అమ్మాయిలను దూరం చేసుకోవడం వంటి సీన్లు అలరించేలా తెరకెక్కించారు. నవ్విస్తూనే ఆలోచింప చేసేలా ఉంటాయి. హీరో పాత్రని కేవలం కామెడీగానే కాదు, అందులోనూ బాధ్యతని చూపించిన తీరు బాగుంది.
మంచితనం, బాధ్యత వంటి లక్షణాలు హీరోకి ఉంటేఇప్పుడు వర్కౌట్ కాదు, కానీ ఇందులో దాన్ని కన్విన్సింగ్‌గా చూపించడం విశేషం. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సీన్లు ట్రెండీగా ఉంటాయి. ఇప్పటి యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అవే సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఏ సినిమా అయినా కథ బలంగా లేకపోతే ఓ దశలో కొంత నిరాసక్తి అనిపిస్తుంది. ఇందులోనూ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లు ఇరికించాయా? అనేలా ఉంటాయి. లాజిక్ లేకుండా ఉంటాయి.అయితే సెకండాఫ్‌లో కొంత ఎమోషనల్ టచ్, క్లైమాక్స్ లో స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ లు హైలైట్‌గా నిలిచాయి. క్లైమాక్స్ ని కొత్తగా చూపించిన తీరు కూడా బాగుంది. సో ఇలా కథ, లాజిక్‌లు పక్కన పెట్టి చూస్తే ఈ మూవీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని చెప్పొచ్చు.
నటీనటులుః
హీరో శ్రీవిష్ణు మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ, కామెడీని నమ్ముకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్ అవుతున్నాడు. మిగిలిన హీరోల్లో మాస్ ఇమేజ్‌కి పోకుండా తన పరిధి మేరకు తన బెస్ట్ ఇస్తూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. నటుడుగా మెప్పిస్తున్నాడు.ఈ మూవీలోనూ విజయ్‌గా తనదైన నటనతో, కామెడీతో అలరించారు. అమాయకత్వంలో నవ్వులు పూయించాడు. వెన్నెల కిశోర్ తో కలిసి వెండితెరపై రచ్చ చేశారు. ఇక వెన్నెల కిశోర్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో వీరిద్దరే మెయిన్ హైలైట్. ఇక కేతిక శర్మ గ్లామర్‌తోపాటు నటనతోనూ ఆకట్టుకుంది.
ఇవానా సైతం అందంతోపాటు అభినయంతోనూ కాసేపు అలరించింది. ఇక వీటీవీ గణేష్ కామెడీ మరో అసెట్‌గా చెప్పాలి. ఎప్పటిలాగే మెప్పించాడు. రాజేంద్రప్రసాద్ కాసేపు మెరిశారు. ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఉన్నంతలో ఓకే అనిపించారు.
టెక్నీషియన్లుః
టెక్నీకల్‌గా మూవీ చాలా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కామెడీకి తగ్గట్టుగా ఆయన అందించిన బీజీఎం కూడా అలరించేలా ఉంది. వేల్ రాజ్ కెమెరా వర్క్ మరో బలం. విజువల్స్ పరంగా చాలా కొత్తగా అనిపిస్తుంది. అదేసమయంలో కలర్‌ఫుల్‌గానూ ఉంటుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలకు కొదవ లేదు.
ఇక దర్శకుడు కార్తీక్ రాజు కామెడీని నమ్ముకుని ఈ మూవీని తెరకెక్కించాడు. ఆ విషయంలో ఆయన సినిమాకి న్యాయంచేశాడు. ఆడియెన్స్ ని అలరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కథ పరంగా ఏదైనా కొత్తగా చేసి ఉంటే బాగుండేది. నవ్వులతోపాటు మంచి కథ కూడా ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేది.
రేటింగ్‌ః 3/5