‘‘ఫార్మా రంగంలో ముడిసరుకు, సహాయక పదార్థాల తయారీ ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఉత్తేజంతో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం’’అనేది సిగాచీ ఇండస్ట్రీస్ నినాదం.హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో భారీ పేలుడు జరిగిన సిగాచీ ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంది.ఫార్మా రంగంలో ఈ కంపెనీకి దాదాపు 36 ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా డ్రగ్స్ తయారీలో వాడే ప్యూర్ డ్రగ్ (ప్రధాన ఔషధం), సహాయక పదార్థాలను కంపెనీ తయారు చేస్తోంది.అయితే పేలుడు ఘటనపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సిగాచీ క్లోరోకెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమ.. జనవరి 11, 1989లో ప్రారంభమైనట్టు కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది.
వాణిజ్యపరంగా మరింత విస్తరించేందుకు 2012లో యాజమాన్యం కంపెనీ పేరును సిగాచీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చింది.తర్వాత 2019 డిసెంబరు నాటికి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. అప్పట్నుంచి సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా కొనసాగుతోంది.తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్, కర్ణాటక కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.హైదరాబాద్‌లో ఒక తయారీ యూనిట్ ఉండగా.. గుజరాత్‌లో రెండు, కర్ణాటకలోని రాయచూర్‌లో మరో యూనిట్ ఉంది.హైదరాబాద్ యూనిట్ సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో సుమారు నాలుగు ఎకరాల్లో ఉందని, దాదాపు 190మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ యూనిట్‌లో కంపెనీ మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్(ఎంసీసీపీ) తయారు చేస్తున్నట్లుగా నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో సిగాచీ యాజమాన్యం పేర్కొంది.‘‘హైదరాబాద్, గుజరాత్ యూనిట్లలో కలిపి 59 రకాల ఎంసీసీపీ తయారు చేస్తున్నాం. ఈ యూనిట్లు ఏడాదికి 11,880 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి” అని తన నివేదికలో సిగాచీ యాజమాన్యం ప్రస్తావించింది.ఇందులో ఏడాదికి 6వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి హైదరాబాద్ పాశమైలారం పరిశ్రమ నుంచే అవుతున్నట్లుగా నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ స్పష్టం చేస్తోంది.
ఫార్మా రంగంలో డ్రగ్ తయారీలో మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్ ఎంతో కీలకమని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బెండి రాజగోపాలరావు బీబీసీతో చెప్పారు.‘‘ఇది బైండింగ్ మెటిరియల్ గా ఉపయోగపడుతుంది. డ్రగ్ తయారీలో ప్రధాన ఔషధాన్ని సహాయక పదార్థాలతో కలిపి ఉంచడం లేదా డ్రగ్‌కు కవచంగా ఈ పౌడర్ వాడుతుంటారు. దాన్ని సిగాచీ యాజమాన్యం హైదరాబాద్ యూనిట్లో తయారు చేస్తోంది’’ అని చెప్పారు.కేవలం ఫార్మా పరంగానే కాకుండా న్యూట్రిస్యూటికల్ ఆహార తయారీ రంగంలో వినియోగించే సహాయక పదార్థాలను కూడా సిగాచీ ఇండస్ట్రీస్ తయారు చేస్తోంది.
కంపెనీకి ప్రస్తుతం ఎండీ, సీఈవోగా అమిత్ రాజ్ సిన్హా వ్యవహరిస్తున్నారు. చైర్మన్‌గా రవీంద్ర ప్రసాద్ సిన్హా, వైస్ చైర్మన్‌గా చిదంబరనాథన్ షణ్ముగనాథన్ ఉన్నారు.సహజంగా మందుల తయారీలో కొన్ని రకాల సహాయ పదార్థాలు వినియోగించాల్సి ఉంటుంది. ఇవి ప్రధాన డ్రగ్‌కు సహాయకంగా ఉంటాయి. ఇన్‌యాక్టివ్ పద్ధతిలో వీటిని డ్రగ్‌లో వినియోగిస్తారు.వీటితోపాటు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్ (ఏపీఐ) ను తయారు చేస్తోంది.ఏపీఐను ఇతర సహాయక పదార్థాలతో కలిపితే మనం నిత్యం వినియోగించే ఔషధాలు తయారవుతాయని బిట్స్ పిలానీ, హైదరాబాద్ ఫార్మా డిపార్ట్‌మెంట్ హెడ్ యోగీశ్వరి పెరుమాళ్ బీబీసీతో చెప్పారు.
”ఏపీఐ అంటే ప్రధాన ఔషధం లేదా ప్యూర్ డ్రగ్ గా చెబుతారు. దీన్ని ఇతర సహాయక పదార్థాలతో కలిపి ఔషధాన్ని తయారు చేస్తారు. అవి ట్యాబ్లెట్ల రూపంలో ఉండవచ్చు లేదా ఇంజెక్షన్ రూపంలో కావొచ్చు” అని వివరించారు.సిగాచీ తయారు చేస్తున్న డ్రగ్స్‌లో ప్రధానంగా యాంటి-అల్సర్ ఉత్పత్తులు ఉన్నాయి. మొత్తం 9 రకాల ఏపీఐలను తయారు చేస్తోంది. ఇవి న్యూరో, హెచ్ఐవీ-ఎయిడ్స్, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగిస్తుంటారు.”ప్రెగాబెలిన్, రైటోనావిర్, హెట్ ఫార్మిన్ హెచ్‌సీఎల్, ప్రొపాఫెనొన్ హెచ్‌సీఎల్ సహా 9 రకాల ఏపీఐలు తయారు చేస్తున్నాం” అని సిగాచీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.పేలుడు తర్వాత సిగాచీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
సిగాచీ ఇండస్ట్రీస్ 2021లో 163 రూపాయల ప్రీమియంతో ఐపీవోకు వెళ్లగా.. 153 రూపాయల ధరతో లిస్ట్ అయింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఈ కంపెనీ లిస్ట్ అయింది.షేర్ మార్కెట్ విలువ ప్రకారం సిగాచీ రూ.1863.20 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఉంది.పేలుడు కారణంగా 90 రోజుల పాటు హైదరాబాద్ తయారీ యూనిట్‌లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు సిగాచీ సంస్థ ఎన్ఎస్ఈకి సమాచారం ఇచ్చింది.