రాజకీయాల్లో ఒక్కోసారి జంపింగుల వల్ల ఎంతో లాభం వస్తుంది. మరోసారి అవే ప్రతిబంధకాలు అవుతాయి. 2014 లో జంపింగులు చేసిన వారు అంతా రాజకీయంగా లాభపడిన వారే. కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి జంపింగ్స్ చేసి టీడీపీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు దక్కడమే కాదు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కొందరికి చోటు దక్కింది. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవనడానికి 2024 పెద్ద ఉదాహరణ. ఈసారి టీడీపీ వేరు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పార్టీ మీద పూర్తి పర్యవేక్షణ ఉంచారు. దాంతో ఎవరు చేరాలన్నా లేక చేరిన వారికి పదవులు ఇవ్వాలన్నా పూర్తిగా అన్నీ కోణాలలో నుంచి ఆలోచిస్తున్నారు. వెంటనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలో కీలకమైన వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావు 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి గెలిచారు. ఆయన ఇలా గెలిచారో లేదో అలా మంత్రి పదవిని ఇచ్చి చంద్రబాబు ఆదరించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు తన వ్యాపారాల కోసం అన్నట్లుగా ఆయన వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరఫున పదవులు ఆశించినా దక్కలేదు ఇక 2024లో తన సొంత నియోజకవర్గం దర్శి నుంచి పోటీకి ప్రయత్నించారు. ఆ టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని కోరారు. కానీ నో చెప్పిన శిద్ధా ఫ్యామిలీ ఎన్నికల తరువాత వైసీపీని వీడి బయటకు వచ్చేసింది.
ఆనాటి నుంచి టీడీపీలో చేరాలని శిద్ధా ఫ్యామిలీ చూస్తోంది. గత ఏడాది బెజవాడ వరదలు వచ్చినపుడు పెద్ద మొత్తాన్ని విరాళంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మరీ శిద్ధా రాఘవరావు బాబుని కలిశారు. దాంతో ఆయన అప్పట్లోనే టీడీపీలో చేరుతారు అనుకున్నా ఏడాది గడచింది కానీ పిలుపు అయితే రాలేదు. అంతే కాదు ఆయనకు టీడీపీ గేట్లు తెరచుకోలేదు అని అంటున్నారు. దానికి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేత కారణం అంటున్నారు. అంతే కాదు పార్టీ అధినాయకత్వం కూడా ఆయన విషయంలో ఏమీ చెప్పకుండా పెండింగులో పెట్టింది అని అంటున్నారు.
కష్టకాలంలో టీడీపీని వదిలేసి వైసీపీలోకి వెళ్ళి తిరిగి అధికారంలోకి వచ్చాక చేరుదామని వచ్చే వారి విషయంలో టీడీపీ ఇపుడు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అంతే కాదు పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్ద పీట వేయాలని అయిదేళ్ళు విపక్షం లో ఉంటూ అన్ని బాధలు తట్టుకున్న వారికే అగ్ర తాంబూలం ఇవ్వాలని పార్టీ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు దాంతో పాపం పెద్దాయనకు పసుపు శిబిరంలో చేరే అవకాశం అయితే దక్కడం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.