చిత్రం: ‘శుభం’
నటీనటులు: సమంత, హర్షిత్, శ్రీనివాస్ రెడ్డి,చరణ్ పేరి, శ్రియా కొంతం,శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు.
సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్
బ్యానర్స్: ట్రాలాలా ప్రొడక్షన్స్
నిర్మాత: సమంత రుత్ ప్రభు
సినిమాటోగ్రఫీ : మృదుల్ సేన్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్: అనికేత్ మిత్ర
ప్రొడక్షన్ డిజైన్: రామచరణ్ తేజ్ లబానీ
బ్యానర్: ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా సమంత కూడా నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ట్రాలాల ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ‘శుభం’ సినిమా నిర్మించింది. సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది. అంతేకాదు పలు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇంత బీజీ షెడ్యూల్లో కూడా నిర్మాతాగా ‘శుభం’ సినిమా నిర్మించడమే కాదు. అందులో ఓ కీలక పాత్రలో నటించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా సమీక్షలో చూద్దాం..
కథ విషయానికొస్తే.. భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ శ్రీను (హర్షిత్ రెడ్డి) తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) హ్యాపీగా లైఫ్ గడుపుతుంటారు. అయితే ఈ ముగ్గురు భార్యలు శ్రీవల్లి, ఫరీదా, గాయత్రి (శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి)కి తెలుగు టెలివిజన్ సీరియల్ జన్మజన్మల బంధం అంటే పిచ్చి. ఆ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో ఎవరైనా అడ్డుకొంటే వారి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు. ఈ స్నేహితుల భార్యలు రాత్రి 9 గంటలకు వచ్చే ‘జన్మజన్మల బంధం’ అనే టీవీ సీరియల్ కు అతుక్కుపోతారు. ఆ సమయంలో వారిని కదిలించినా.. ఇంకా ఏదైనా చేస్తే దెయ్యం వచ్చిన వారిలా ప్రవర్తిస్తుంటారు. అయితే.. ఆ ఊరిలో ఈ ముగ్గురి భార్యలతో పాటు ఆ ఊరిలోని దాదాపు మెజారిటీ లేడీస్ రాత్రి 9 గంటలకు ఇలానే ప్రవర్తిస్తుంటారు.
అలాంటి భార్యల పిచ్చి వల్ల శ్రీను, అతడి స్నేహితుల బతుకు తలకిందులవుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామంలో ఉండే మాంత్రికురాలు మాయ మాత (సమంత రుత్ ప్రభు)ను సలహా కోసం ఆశ్రయిస్తారు. మరి వారి భార్యలను బాగు చేసుకోవడంతో పాటు ఊర్లో ఆడవాళ్లను మాములు మనుషులుగా చేయడానికి ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేసారు. చివరకు వీరితో పాటు ఊరి ప్రజలకు శుభం జరిగిందా లేదా? శ్రీనుకు అతడి స్నేహితులకు తమ భార్యల నుంచి వచ్చిన కష్టం ఏమిటి? తెలుగు సీరియల్ వారి జీవితంలో అశాంతికి కారణమైంది? మాయ మాతను ఆశ్రయిస్తే వారికి ఆమె ఇచ్చిన సలహా ఏమిటి? మాయ మాత సలహాలు వారికి ఎలా ఉపయోగపడ్డాయి? శ్రీను బృందానికి ఆ గ్రామంలోని డిష్ కుమార్ ఇచ్చిన షాక్ ఏమిటి? ఆ షాక్‌ను ఈ ముగ్గురు ఎలా తిప్పి కొట్టారు? గ్రామస్థులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ కష్టానికి శ్రీను అతడి స్నేహితులు పరిష్కారం చూపించారు? అనే ప్రశ్నలకు కామెడీగా, ఫన్‌గా చెప్పిన జవాబులే శుభం సినిమా కథ.
విశ్లేషణ: సమంత నిర్మాతగా మారి రూపొందించిన ‘శుభం’ సినిమా కథ కొత్తగా సృష్టించిందేమీ కాదు. గొప్పగా సాంకేతికత జోడించి అబ్బుర పరిచే సినిమా అంతకంటే మాత్రం కాదు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ నిత్యం జరిగే ఈ చిన్న తమాషా సంఘటన.. దాని వల్ల కాపురాలు, కుటుంబాల్లో ఎలాంటి అశాంతి కలుగుతుందనే విషయాన్ని అత్యంత వినోదంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. ఈ సినిమా కథను చెప్పిన విధానం.. ఆ స్టోరీని చెప్పడానికి పాత్రలను డిజైన్ చేసిన విధానం మరోసారి ‘సినిమాబండి’ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వ ప్రతిభను తెలియజెప్పింది. అత్యంత సహజమైన విధానంలో ముగ్గురు దంపతుల క్యారెక్టర్లను మలిచిన విధానం.. అలాంటి పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన విధానమే ఈ సినిమా సక్సెస్‌కు బాట వేసిందని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా మన దర్శకులు 80, 90ల నాటి బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల కూడా ‘శుభం’ కథను 2004 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. అప్పట్లో కేబుల్ టీవీ ప్రతి ఇంటిలో ఎలా భాగం అయిందో.. దానికి పోటీగా డీటీహెచ్ ఎంట్రీ వంటి రాకతో కేబుల్ టీవీ ప్రాపకం ఎలా మసకబారిందో అనే అంశాలను అంతర్లీనంగా చూపించాడు. ముఖ్యంగా ఇయర్ చూపించకపోయినా.. అందులో శంకర్ దాదా జిందాబాద్, గుడుంబా శంకర్,నువ్వు లేక నేను లేను, ఇక శుభం కథ విషయంలో కూడా ఆకాశంలో సగ భాగమైన మహిళలు, ముఖ్యంగా భర్తతో పాటు భార్యకు సమ ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని చూపించాడు. దానికి ఓ టీవీ సీరియల్ ను ఎంచుకున్నాడు. అందులో విడిపోయిన భార్య భర్తలు తిరిగి ఎలా కలుసుకున్నారు. అలా ఊరిలో 9 గంటలకు అందరు టీవీ సీరియల్ వచ్చే సమయానికి ఏదో దెయ్యం పట్టినవాళ్లలా దానికి అతుక్కోవడం. ఆ సమయంలో వాళ్లను డిస్ట్రబ్ చేస్తే నానా రభస సృష్టించడం వంటి సీన్స్ తో కామెడీ పుట్టించే ప్రయత్నం చేసాడు.
ఇక ఇంటి ఇల్లాలు అంటే వంటింటి కుందేలు అనే తరహాలో కాకుండా వారికి తగినంత గౌరవంతో పాటు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడలనే సందేశం కూడా ఈ సినిమాలో చూపించాడు. అంతేకాదు మెజారిటీ మహిళలు చాలా మంది ఏ విషయంలోనైనా శుభప్రదమైన ముగింపు ఉండాలని కోరుకుంటారు. అదే అంశాన్ని దర్శకుడు ఈ సినిమాలో చక్కటి వినోదంతో చూపించాడు. అక్కడక్కడ ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాలో మెయిన్ అనే అంశాన్ని ఇక్కడ మేము ప్రస్తావించడం లేదు. అది ప్రస్తావిస్తే థియేటర్ లో సినిమ చూసే ప్రేక్షకుడికి అలా థ్రిల్ పోతుంది. అది తెరపై చూస్తూనే మజా వస్తుంది. మొత్తంగా సమంత నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి మహిళా మెసేజ్ ఇచ్చే చిత్రాన్ని నిర్మించడం విశేషం.
నటీనటల ఎలా చేశారంటే… స్టార్ హీరోలు ఉన్న సినిమాలు రెండు గంటలు చూడటానికి కష్టాలు పడుతున్న సమయంలో.. ఏ మాత్రం ముఖ పరిచయం లేని తెర మీద మూడు జంటలు.. ఆరుగురు నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌తో రెండు గంటలపాటు సీట్లలో అత్తుకుపోయేలా చేశారు. నవ్వించడమే కాకుండా కొన్ని సీన్లలో ఎమోషన్‌కు కూడా గురి చేశారు. మన కుటుంబంలో మన చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్‌ను గుర్తు చేసేలా నటించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ యాక్టింగ్‌తో అదరగొట్టారు. అతిథి పాత్రల్లో కనిపించిన సమంత ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మిగితా పాత్రల్లో వారంతా తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
టెక్నీకల్ అంశాలజోలికి వస్తే… క్లింటన్ సెరెజో అందించిన పాటలు సందర్బోచితంగా బాగున్నాయి. డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను లైవ్లీగా మార్చింది. మృదుల్ సేన్ సినిమాటోగ్రఫి నేచురల్‌గా సీన్లను చూపించే ప్రయత్నం బాగుంది. ధర్మేంద్ర కాకరాల తన కత్తెరను సరైన రీతిలోనే ఉపయోగించారు. ట్రూ లా లా ప్రొడక్షన్ టీమ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సమంత నిర్మాతగా తన తొలి సినిమాతోనే ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల ప్రేమ, అకింత భావం ఏమిటో మరోసారి తెలిసింది. పాలు నీళ్ల బంధం.. జన్మజన్మల బంధం అంటూ సాగే టెలివిజన్ సీరియల్‌ను కథలో వాడుకొన్న తీరు సినిమాకు బలంగా మారింది.
ఫస్టాఫ్‌లో సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన విధానం.. పాత్రల పరిచయం.. వారి యాటిట్యూడ్, బిహేవియర్‌ను చూపించిన విషయాలు కథలో లీనమయ్యేలా చేసింది. ఫస్టాఫ్‌లో కథను సరైన ట్రాక్‌లో నడిపించిన ప్రవీణ్.. సెకండాఫ్‌లో పూర్తిగా తడబడ్డాడు. స్క్రిప్టులో అనేక లోపాలు కనిపించాయి. వాటిని కప్పిపుచ్చడానికి సినిమాబండి టీమ్‌ను సినిమాలోకి లాగి పెద్ద కసరత్తే చేశాడనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ బాగుంది. ఆర్ఆర్ అదిరిపోయింది. మేకప్ మేన్ తో కాస్ట్యూమ్ వర్క్ డిజైన్ బాగుంది. సినిమాటోగ్రఫీ అప్పటి కాలాన్ని ప్రతిబించింది. మొత్తం మీద నటీనటుల ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి టాలెంట్, విజన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండాఫ్‌లో కథలో సాగదీత.. స్క్రిప్టులో కొంత గందరగోళం తప్పిస్తే.. మిగితా విషయాలన్నీ ఫర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సాగే రెండు గంటల వినోద భరిత చిత్రం. లాజిక్కులు, అంచనాలు అవసరం లేకుండా హ్యాపీగా ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
రేటింగ్: 3/5