భార్యభర్తల మధ్య గొడవలు ఏ స్థాయిలో జరుగుతాయో.. అవెంత వరకు వెళతాయో? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి ఉదంతానికి సంబంధించి ఊహించని రీతి వరకు వెళ్లిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. గొడవ పెరిగి పెద్దది కావటమే కాదు.. హద్దులు దాటేసిన ఈ వైనంలో భర్త నాలుకను కొరికేసిన భార్య.. నమిలి మింగేయటమే కాదు.. డేంజర్ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా గొడవ పడిన వైనం విస్తుపోయేలా చేసింది.
ఈ షాకింగ్ ఉదంతం బిహార్ లోని గయలో చోటు చేసుకుంది. ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్తా పెద్దదిగా మారటమే కాదు.. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో తీవ్ర కోపంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను బలంగా కొరికేసింది. దెబ్బకు నాలుక ఉడిపోగా.. దాన్ని అలానే నమిలేసి.. మింగేసింది.
ఈ షాకింగ్ పరిణామంతో భర్త ఆరోగ్యం విషమించింది. దీంతో గ్రామస్తులు కలగజేసుకొని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున రక్తం పోవటంతో ప్రాథమిక చికిత్స చేసి మగధ్ వైద్య కళాశాలకు సిఫార్సు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంత జరిగిన తర్వాత కూడా ఆసుపత్రిలోనూ భార్యాభర్తలు ఇద్దరు గొడవపడిన వైనాన్ని చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు వీళ్లెక్కడి మనుషులు అంటూ ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అయితే.. ఈ ఉదంతంపై భార్యభర్తల్లో ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి