ఓవైపు కింగ్ ఖాన్ షారూఖ్, అతడి భార్య గౌరీ ఖాన్ తమ ఐకానిక్ భవంతి ‘మన్నత్’ రెనోవేషన్ కోసం ఇటీవల దానిని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ -జాకీ భగ్నానీ కుటుంబానికి చెందిన పూజా కాసా అనే భవంతిలోకి అద్దెకు వెళ్లారు. ఇది పాళి హిల్స్ ఏరియాలో ఉంది. దీనికోసం భగ్నానీ కుటుంబానికి ఖాన్ కుటుంబం భారీ అద్దెను చెల్లిస్తోంది.
ఇదిలా ఉండగానే, కింగ్ ఖాన్ షారూఖ్ కి శ్రీ అమృత్ సొసైటీ బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో దాదాపు 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో సరికొత్త సీఫేసింగ్ 4 BHK అపార్ట్‌మెంట్‌ను అందించనుందని తెలిసింది. షారూఖ్ తన పెళ్లి తర్వాత కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్ ఇది. ఇది ముంబైలో అతని మొదటి ఆస్తి. కానీ పునరావాస చట్టం కారణంగా ఆలస్యంగా ఇప్పటికి అతడి చేతికి ఫ్లాట్ అందుతోంది. శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియాలిటీ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ ను 2027 నాటికి కస్టమర్లకు అందించనుందని తెలిసింది. అయితే ఇది రీడెవలప్‌మెంట్ కారణంగా 155శాతం అదనపు విస్తీర్ణంతో కస్టమర్లకు అందనుంది. ఇందులో 4 నుంచి 5 బెడ్ రూమ్ లు ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 1.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 1980 లోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక సొసైటీని కూడా ప్రారంభించారు. కొన్ని ఎకరాల సీఫేసింగ్ ల్యాండ్ లో 45 శాతం పునరావాసాలకు కేటాయిస్తే, 55 శాతం ప్రాంతం అమ్మకానికి ఉంది. కొత్త ఫ్లాట్ ధరను చదరపు అడుగుకు దాదాపు రూ.1.5 లక్షలుగా డెవలపర్ అంచనా వేసారని తెలుస్తోంది.
శ్రీ అమృత్ లోని షారూఖ్ ఫ్లాట్ తన ‘మన్నత్’ (బంద్రా బ్యాండ్ స్టాండ్)కి 3 కి.మీల దూరంలో ఉండగా, సల్మాన్ గేలాక్సీ అపార్ట్‌మెంట్‌కి 2 కి.మీల దూరంలో మాత్రమే ఉంది. బాంద్రా పరిసరాల్లో సీఫేసింగ్‌లో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు షారూఖ్ ఆస్తుల్లోకి మరో అదనపు అపార్ట్ మెంట్ వచ్చి చేరింది. దాదాపు 7300 కోట్ల నికర ఆస్తులతో కింగ్ ఖాన్ భారతదేశంలోనే కాకుండా వరల్డ్ బెస్ట్ సెలబ్రిటీల్లో ఒకరిగా చోటు సంపాదించారు.