జక్కన్న ఉలి వేసి చెక్కాడు! అని పొగిడేస్తారు! కానీ ఇప్పుడు ఉలి వేసి చెక్కే రోజులు పోయాయి. ఏం చెక్కినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లేదా చాట్ జీపీటీ ఇంకా ఏదైనా కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో చెక్కే రోజులు వచ్చేసాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లాంటివి మనుషుల రూపాన్ని నచ్చిన విధంగా మార్చేస్తున్నాయి. వీటికి ఏఐ వంటి సాంకేతికత యాడవ్వడంతో క్రియేటివిటీలో పెను విధ్వంశం మొదలైంది. అసలు ఏఐ బొమ్మకు, మనిషికి మధ్య తేడా కనిపెట్టడం సామాన్యుడి వల్ల అవుతుందా? మరో ఏఐ ఇంజినీర్ కూడా కనిపెట్టలేని పరిస్థితి. మేధావులకు కూడా మతులు చెడుతున్నాయి.
మరి ఇంత గొప్ప సాంకేతికత వచ్చేశాక స్టార్ల వంగి పోయిన ముక్కును, సొట్ట మూతిని లేదా చేటంత ముఖాన్ని మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన కూడా అందగాడేనని భ్రమింపజేసేందుకు సాంకేతికత కావాల్సినంత అందుబాటులో ఉంది. ఇదంతా దేని కోసం అంటే….!
ఇటీవల స్టార్ల ముఖాల్లో గ్లో పెరుగుతోంది. వారి ముఖారవిందాల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించేందుకు అధునాతన సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తోంది. ఒక్కోసారి ఈ సాంకేతికత అవసరానికి మించిపోతోంది.
ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ లేలేత టీనేజీ ముక్కుపై కలిగిన సందేహం అంతా ఇంతా కాదు. ఆయన ఒకప్పటి ముక్కుతో పోలిస్తే ఇప్పటి ముక్కు చాలా అందంగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తోంది. ఏదో ఒక వైపు వంగినట్టు లేదా సొట్ట పడినట్టుగా ఎక్కడా లేదు. ఇప్పుడు చాలా తీరుగ్గా కనిపిస్తోందనే ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది.
అసలు ఖాన్ ముక్కు ఎలా ఇంత అందంగా మారింది? పైగా షారూఖ్ ఎంతో ఇస్మార్ట్ గా మారిపోయి కనిపిస్తున్నాడని కూడా గుసగుసలాడుతున్నారు. ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ `ది బ్యా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` ట్రైలర్ విడుదల కాగానే, ఈ ట్రైలర్ లో ఎందరు స్టార్లు ఉన్నా అందరిలో షారూక్ బాగా హైలైట్ అయ్యాడు. అతడు పాతిక వయసు కుర్రాడిలా కనిపించాడు. షారుఖ్ ఖాన్ ఒక కోపిష్టిగా పరిచయమవుతూ..తనను ఎగతాళి చేసే సహాయకుడిని కొట్టి, చెడామడా తిట్టేస్తాడు ఆ సీన్‌లో. అతిథి పాత్రలో ఖాన్ కావాల్సినంత వినోదం పంచాడు. ట్రైలర్ లో ఖాన్ సీన్ హైలైట్‌గా పండింది.
అయితే ఆ సన్నివేశంలో షారూక్ ముక్కు కొద్దిగా కృత్రిమంగా కనిపించిందని, దీనిని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో మార్చారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెరపై ఖాన్ ముక్కు భిన్నంగా కనిపించిందని ఫ్యాన్స్ గమనించారు. పఠాన్- జవాన్ లో ఖాన్ ముక్కు ముఖాకృతి వేరు. ఇప్పటి ఖాన్ వేరుగా కనిపిస్తున్నాడని కూడా అంటున్నారు. అయితే ఇదంతా కెమెరా మాయాజాలం. డిజిటల్ గా ఎడిట్ చేసేప్పుడు జరిగిన మ్యాజిక్. అక్కడ చాలా మార్పులు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక ఖాన్ ఫేస్ పై లైటింగ్ స్కీమ్ పర్ఫెక్ట్ గా పని చేస్తే, మేకప్ తో చాలా వరకూ ఏజ్ పరమైన అంశాలను కూడా కవర్ చేసేయొచ్చు. మారిన సాంకేతికతలో ఎవరిని ఎవరిలా అయినా మార్చేయగలం. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద డిబేట్ నడుస్తోంది.
అయితే ఎవరి ముక్కు ఎలా ఉంది? అనేదానికంటే ఖాన్ వారసుడు ఆర్యన్ కి దర్శకుడిగా ఎన్ని మార్కుల వేయొచ్చు? ప్రస్తుత సెటైరికల్ డ్రామా పెద్ద తెరపై ఏమేరకు మెప్పిస్తుంది? దర్శకుడిగా తన తండ్రితో సన్నివేశాల్ని మలచడంలో ఆర్యన్ పనితనం ఏ రేంజులో చూపించాడు? అనేవి చాలా పరిశీలించదగిన విషయాలు. కెరీర్ ఆరంభమే సెటైరికల్ డ్రామాతో ఆర్యన్ తనదైన మార్కు వేస్తున్నాడు. ట్రైలర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నెల 18న వెబ్ సిరీస్ స్ట్రీమింగుకి వస్తోంది. ఆరోజు పూర్తి నిడివి సిరీస్‌ని వీక్షించాక ఆర్యన్ పనితనం గురించి మాట్లాడాలి.