మంత్రి నారా లోకేష్ చొరవతో ఆంధ్రా రొయ్యల రైతులకు ఎంతో ఊరట దక్కుతోంది. భారత్ నుంచి ఎతి పెద్ద ఎగుమతిదారుగా ఉన్న ఆంధ్రా రైతులు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఆంక్షలు అధిక సుంకాలతో దిగాలు పడ్డారు. ఆంధ్రా రొయ్య ఎక్కడికీ ఎగరలేని పరిస్థితి ఎదురైంది. ఒక విధంగా ఏపీలో ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిన ఆక్వా ఫీల్డ్ మొత్తం బోసిపోయింది. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆనాడే వారికి ఒక హామీని ఇచ్చింది. కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తామని చెప్పింది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ దానిని నిలబెట్టుకున్నారు.
భారత్ నుంచి రొయ్యలను దిగుమతి చేసుకోవడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే కాదు గతంలో వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఈ రొయ్యల విషయంలో ఉన్న ఆంక్షలు అడ్డంకులు కూడా దూరం అయ్యాయి. ఇక సీ ఫుడ్ ఇండస్ట్రీ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో అక్కడ భాగస్వామ్యం కోసం మంత్రి నారా లోకేష్ జరిపిన చర్చలు అన్నీ సఫలీకృతం అయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రా రొయ్యల రైతులకు భారీ రిలీఫ్ దక్కింది అని చెప్పాల్సి ఉంది.
ఇప్పటిదాకా ఆంధ్రా రొయ్యల రైతులు అమెరికా మీదనే ఆధారపడ్డారు. అక్కడికే సీ ఫుడ్స్ ని ఎగుమతి చేశారు. దాంతో ఒక విధంగా మోనోపలీ అయిపోయింది. అదే అమెరికాకు కూడా అధిక సుంఖాలు బిగించేందుకు కారణం అయింది. ఈ నేపథ్యంలో కొత్త మార్కెట్ గా ఇపుడు ఆస్ట్రేలియా కనిపిస్తోంది. ఈ మేరకు నారా లోకేష్ చేసిన విశేష ప్రయత్నం సక్సెస్ అయింది. కేవలం ఒకే మార్కెట్ మీద ఆధారపడకుండా నూతన మార్కెట్లను అన్వేషించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ చెప్పడం విశేషం. అంతే కాదు భారత దేశం నుంచి రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా తొలిసారి ఆమోదం తెలిపింది అన్నారు. ఈ విషయమో భారత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు రెండు కృషి చేశాయని వారికి ధన్యవాదాలు అన్నారు.
ఇక లోకేష్ తన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సముద్ర ఉత్పత్తులు వాణిజ్యం మీద ఆస్ట్రేలియాతో సరికొత్త భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. ఆ విధంగా ఆయన సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపకోస్టా, ఎంగేజ్‌మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్హెర్‌లతో సమావేశమయ్యారు. అలాగే దేశంలో చూస్తే సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 60 శాతం వాటా ఏపీదే అన్నది వాస్తవం. ఈ క్రమంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఈ ఎగుమతుల విలువ అచ్చంగా 66 వేల కోట్ల రూపాయలు అని లోకేష్ చెప్పారు. మరో వైపు గ్రేట్ ఆస్ట్రేలియన్ సీఫుడ్ పేరుతో సొంత బ్రాండ్‌ను సృష్టించి, తమ ఉత్పత్తులను ప్రీమియం మార్కెట్‌కు తీసుకెళ్లిన ఆస్ట్రేలియా విధానం తనను ఆకట్టుకుందని లోకేష్ చెప్పుకొచ్చారు.
ఇంకో వైపు చూస్తే అమెరికా అర్ధాంతరంగా విధించిన భారీ సుంకాలతో ఏపీలోని ఆక్వా ఫీల్డ్ కి ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయలు భారీ నష్టాలు వచ్చాయి. మొత్తం ఆర్డర్లలో 50 శాతం పైగా ఎగుమతి ఆర్డర్లు రద్దు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయం ఆక్వా రంగానికి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మొత్తానికి లోకేష్ ఆస్ట్రేలియా టూర్ తో ఒక భారీ సక్సెస్ దక్కింది అని అంటున్నారు.















