సినిమాల్లో చూపించే క్రైమ్ కథలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. కానీ వాటిని వాస్తవంలో అనుసరించే ప్రయత్నం ఎప్పటికీ ప్రమాదకరమే అవుతుంది. లక్కీ భాస్కర్ సినిమాలో క్యాషియర్ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించి గెలుస్తాడు. కానీ చెన్నూరు ఘటన మాత్రం పూర్తిగా విరుద్ధంగా సాగింది. అక్కడి ఎస్‌బీఐ ఉద్యోగి నరిగె రవీందర్ జీవితం ఒక హెచ్చరికగా నిలిచిపోయింది.
ఆస్తి తాకట్టు పెట్టిన ఆన్ లైన్ బెట్టింగ్
ఇంజినీరింగ్ పూర్తి చేసిన రవీందర్ ప్రతిభతో జాతీయ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అతనికి ఈ ఉద్యోగం జీవితం మార్చే అవకాశం కావాలి. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ అనే వ్యసనం అతని భవిష్యత్తును చెరిపేసింది. మొదట్లో అప్పుల వలలో చిక్కుకుని, 2024లోనే సుమారు 40 లక్షల వరకు లోన్స్ తీసుకున్నాడు. కుటుంబ ఆస్తిని తాకట్టు పెట్టి తీర్చుకున్నా, వ్యసనం మాత్రం వదలలేకపోయాడు. చివరికి తానే పనిచేస్తున్న బ్యాంకులో దుర్వినియోగానికి పాల్పడ్డాడు.
స్నేహితులు, బంధువుల పేర్లతో..
రవీందర్ మొదట రుణగ్రహీతలు తాకట్టుపెట్టిన బంగారం బయటకు తీయడం ప్రారంభించాడు. స్నేహితులు, బంధువుల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచాడు. మొత్తం 42 నకిలీ రుణ ఖాతాల ద్వారా 4.14 కిలోల బంగారం లేనట్లు చూపించి 1.58 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అంతేకాకుండా ఏటీఎం డిపాజిట్ డబ్బులోనూ కొంత భాగాన్ని మాయం చేశాడు.
క్యాషియర్‌పై సహజంగానే అందరికీ విశ్వాసం ఉంటుంది. రవీందర్ ఆ నమ్మకాన్ని వినియోగించుకున్నాడు. సహోద్యోగులతో మమేకమై, పనిలో చురుకుగా కనిపించడంతో ఎవరూ అనుమానం పెట్టుకోలేదు. మేనేజర్, అటెండర్‌తో పాటు మరో 41 మందిని తన మాయలోకి దింపి ఏడాది పాటు ఈ మోసాన్ని దాచగలిగాడు. కానీ అబద్ధం ఎప్పటికీ నిలవదు. చివరకు నిజం బయటపడి, పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. బంగారం, నగదు స్వాధీనం చేశారు.
ఈ ఘటనలో స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, వ్యసనం ఒకరి భవిష్యత్తు మాత్రమే కాదు, కుటుంబం, సమాజం మొత్తానికి నష్టం చేస్తుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించినా, వాటి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. చెన్నూరు సంఘటన డిజిటల్ వ్యసనాలు ఎంతటి ప్రమాదానికి దారి తీస్తాయో మరోసారి చాటిచెప్పింది.