ఈ ఏడాది జూన్ లో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడు బ్రిటన్ వెళ్లిపోయాడు. ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. ఆరు నెలల తర్వాత తన పరిస్థితిని వివరిస్తూ ఇటీవల మీడియాకు వివరాలు తెలిపాడు.
అప్పట్లో విమాన ప్రమాదం లాగానే.. తాజాగా సౌదీఅరేబియా బస్సు దహనం దుర్ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు. 45 మంది సజీవ దహనం అయిన ఈ ఘోర ప్రమాదంలో బతికి బట్టకట్టింది ఎవరా? అనే చర్చ మొదలైంది. అందులోనూ మరణించినవారంతా హైదరాబాద్ కు చెందినవారు కావడంతో.. బతికి ఉన్న ఆ ఒక్కరు ఎవరు? అని తెలుసుకోవాలనే కుతూహలం పెరగింది.
హైదరాబాద్ కు చెందిన 46 మంది సోమవారం మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. అర్థరాత్రి వేళ జరగడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకపోయింది. దీంతో 45 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరే గాయాలతో తప్పించుకున్నరు. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లిన టీమ్ లో మొత్తం 54 మంది ఉన్నారు. నలుగురు ఆదివారమే మదీనాకు కారులో వెళ్లిపోయారు. మరో నలుగురు మక్కాలో ఉన్నారు. 45 మంది ప్రమాదంలో సజీవ దహనమయ్యారు.
ఇక ప్రాణాలతో బయటపడిన ఆ ఒక్కరు ఎవరు అంటే? హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ గా తేలింది. ఆయనను దుర్ఘటన ప్రదేశం నుంచి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 45 మంది మృతదేహాలను మార్చురీలో ఉంచారు. సౌదీ అరేబియాలోని జర్మన్ ఆస్పత్రిలో షోయబ్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. -కాగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ సీటు నంబరు 11ఏలో కూర్చోవడంతో ప్రాణాలతో గట్టెక్కాడు. మరి సౌదీ బస్సు దుర్ఘటనలో షోయబ్ ఎలా బయటపడ్డాడు? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం రియాద్ లోని భారత రాయబార కార్యాలయంతో టచ్ లో ఉన్నారు.
సౌదీ ఆరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ క్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని… అందుకోసం బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 45 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఒక ప్రకటనలో తేలింది.మెుత్తం నాలుగు ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయలుదేరారు. విజయవంతంగా మక్కా యాత్రను పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మదీనాకు మరో 25 కిలోమీటర్ల దూరం ఉండగా ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది.భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారు జామున 1:30 గంంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులు అంతా గాఢ నిద్రలో ఉండటం వల్లే మృతులు సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. నజీరుద్దీన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.నజీరుద్దీన్ తన కుటుంబంతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఎంతో ఉత్సాహంగా వెళ్లిన వీరంతా బస్సు ప్రమాదంలో సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నసీరుద్దీన్ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడి నివాసం వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. ఈ క్రమంలో నజీరుద్దీన్ కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లు పరామర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాయని హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం కూడా అండగా ఉంటుందని ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఇకమృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటనలో తెలిపింది. రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని… అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా వార్తలు వచ్చాయి. వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు. సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.
సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
.+91 79979 59754
+91 99129 19545
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని వెల్లడించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.
మదీనా-మక్కా రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కిరణ్ రిజిజు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.


















