‘బతుకమ్మ’- ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ సంప్రదాయం. ఏటా దేశంలో ఆశ్వీయుజ మాసం(సెస్టెంబ రు-అక్టోబరు మధ్య వచ్చేది)లో దేవీ శరన్నవరాత్రులు జరుగుతాయి. ఇవి తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. దుర్గాదేవిని పలు రూపాల్లో అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీ. ఇదేసమయంలో తెలంగాణలోనూ.. బతుకమ్మ సంబరాల పేరుతో 9 రోజులు పూజలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఈ సంబరాలు అంబరాన్నంటాయి. ఏటా జరుగుతున్నప్పటికీ.. ఈ ఏడు.. మరింత ఎక్కువగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఈ సంబరాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి.
ఈ కాలంలో విరబూసే.. రకరకాల పువ్వులను ఏర్చి పేర్చి.. ఓ గోపురం మాదిరిగా ఏర్పాటు చేసి.. హారతులు ఇచ్చి.. పసుపు, కుంకాలతో అలంకరించి.. మహిళలు పూజలు చేస్తారు. అనంతరం.. దాని చుట్టూ తిరుగుతూ.. జానపద గీతాలతో ఆటపాటలు నిర్వహిస్తారు. తరతమ బేధం లేకుండా..స్థాయిలతోనూ సంబంధం లేకుండా.. నాయకుల నుంచి అధికారుల వరకు, సామాన్యుల నుంచి ఉన్నవారి వరకు అన్ని కుటుంబాల నుంచి మహిళలు పాల్గొని ఈ సంబరాలు చేసుకుంటారు. తమ పసుపు కుంకుమలను పదికాలాల పాటు నిలపాలన్న సారాంశంతో కూడిన పాటలు పడుతూ…. బతుకమ్మలకు మొక్కులు మొక్కుతారు. ప్రతి ఇంటి నుంచి పువ్వులు తీసుకువచ్చి.. బతుకమ్మల అలంకారంలో వినియోగిస్తారు.
తెలంగాణలో ఈ సంస్కృతి అనాదిగా ఉంది. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో మరింత ఎక్కువగా దీనిని వినియోగించు కున్న అప్పటి బీఆర్ ఎస్ నాయకురాలు కవిత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో మహిళలను కూడా ఏకం చేయగలిగేలా.. చేశారు. అసలు బతుకమ్మ ప్రాశస్త్యం వెనుక.. ఉన్నదంతా.. మహిళల పసుపు కుంకుమల గురించే కావడం గమనార్హం. ఈ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో అమ్మవారిని కొలిస్తే.. బతుకమ్మల సంబరంలో కేవలం పార్వతీ దేవిని గౌరీదేవిగా భావించి.. ఎలాంటి ప్రత్యేక రూపం లేకుండా పువ్వుల గుట్టను పేర్చి.. ఆమెనే గౌరీదేవిగా భావించి.. మహిళలు ఆరాధిస్తారు. అనంతరం.. ఆ పువ్వులను ఇంటికి తీసుకువెళ్లి.. అలంకరించుకుంటారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు.. విభిన్నంగా సాగుతాయి. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ.. ఇలా అనేక పేర్లతో తొమ్మి ది రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిలో భాగస్వామ్యం అవుతారు. ఈ ఏడాది మరింత ఎక్కువగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణలో పువ్వుల సాగు ఎక్కువగా జరిగింది. దీనికి తోడు.. ప్రభుత్వం కూడా దీనిని అధికారిక పండుగగా గతంలోనే గుర్తించింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ.. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బతుకమ్మ ఉత్సవం.. 2 గిన్నిస్ రికార్డులను సృష్టించింది. 1) 63 అడుగుల ఎత్తయిన బతుకమ్మను ఏర్చి కూర్చడంతో రికార్డు సృష్టించగా.. రెండోది ఒకేసారి 1300 మందికి పైగా మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మను పూజించి.. సంబరాలు చేసుకున్నారు. దీంతో అతి పెద్ద మహిళా ఉత్సవంగా ఇది రెండో రికార్డును సొంతం చేసుకుంది. కాగా.. నీరు-నేల-ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేయడమే ఈ ఉత్సవానికి ఉన్న ప్రాధాన్యతని పలువురు పేర్కొనడం గమనార్హం.