సంక్రాంతికి వస్తున్నాం సినిమా సందర్భంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు, ఇందులో ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సన్నివేశాలు ఉంటాయని వివరించారు. సినిమాను కొంచెం వైవిధ్యంగా చేయాలనుకుంటున్నానని అనిల్ చెప్పగానే, అందుకు ఆయన ఇచ్చిన సమాధానం తనను బాగా ఆకట్టుకుందని అన్నారు.
“ఎలాంటి వైవిధ్యం వద్దండి… దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, చంటబ్బాయి… ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో అలా ఉంటే చాలు” అని ఆయన అన్నారు.
అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూసి ఎంతగానో ఆదరించారని, అవన్నీ ప్రేక్షకులకు తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోయాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్‌కు ఆ తరహా సినిమాల స్టైల్, మజా, ఫీల్ తెలియకపోవచ్చని, అందుకే ఆ అనుభూతిని ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ప్రయత్నమే ఈ సినిమా అని పేర్కొన్నారు. ఆ మాటలు విన్న తర్వాత తాను ‘సరే’ అన్నానని, ఆయనతో ఈ సినిమా చేయడం తనకు చాలా మంచి అనుభవంగా మారిందని అన్నారు.
సినిమా షూటింగ్ పూర్తయిన ఆఖరి రోజు తాను చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానని తెలిపారు. “ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. బడ్జెట్ లిమిట్లోనే చేశాం. అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లోనే అద్భుతంగా షూటింగ్ పూర్తి చేయగలిగాం. ఒక సినిమాకు ఇది మొదటి విజయం. రెండో విజయం 12 తారీఖున ప్రేక్షకులు ఎంత ఘనంగా ఆదరిస్తారన్నదానిపై ఆధారపడి ఉంటుంది” అని అన్నారు.
తన తమ్ముడు **వెంకటేష్**తో సినిమా చేయడం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందని చెప్పారు. వెంకటేష్ చాలా పాజిటివ్ వ్యక్తి అని, ఆయనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్‌గా అనిపిస్తుందని తెలిపారు. “మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులా ఉంటాడు. ఆయనతో మాట్లాడితే ఎంతో స్ఫూర్తి వస్తుంది” అని ప్రశంసించారు.
చాలా సంవత్సరాల క్రితం ఇద్దరూ కలిసి అమెరికా వెళ్లినప్పుడు ఒక స్టిల్ ఫోటో దిగామని, అప్పుడే ‘మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుంది’ అని వెంకటేష్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎన్నాళ్లకో ఆ కోరిక అనిల్ రావిపూడి ద్వారా నెరవేరిందన్నారు.
“ఈ కాంబినేషన్‌కు పూర్తి న్యాయం చేయగలిగింది అనిల్ రావిపూడి(AnilRavipudi) మాత్రమే. మా కలయిక చాలా అద్భుతంగా వచ్చింది. ఇది యాక్టింగ్ చేసినట్టు ఉండదు… ఇద్దరు కుర్రాళ్లు కలిసి అల్లరి చేసినట్టుగా ఉంటుంది. వెంకీ, నేను ఇద్దరం షూటింగ్‌లో చాలా ఎంజాయ్ చేశాం. థియేటర్లలో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.
ఈ సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి, మరో సినిమా వైపు అడుగు వేయడానికి దోహదపడిన వెంకటేష్‌కు సభాముఖంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. “సినిమా గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. అనిల్ మాట్లాడుతూ మనిద్దరం కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే బాగుంటుందని అన్నారు. అలాంటి మంచి కథ రాస్తే మేము తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ తన మాటలను ముగించారు.











