మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నవంబర్ 17 ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ్, తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇవ్వడంతో పాటూ తాను తిరుమల రావడానికి గల కారణాల్ని తెలిపారు. తనకు మంచి సినిమాలు, మంచి లైఫ్ ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు తిరుమల వచ్చానని చెప్పారు సాయి తేజ్.
కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో ఆ దేవుని ఆశీస్సులు కావాలని ఇక్కడికి వచ్చి భగవంతుణ్ని దర్శించుకున్నానని చెప్పిన సాయి తేజ్, తాను హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా కూడా నెక్ట్స్ ఇయర్ లోనే రిలీజవుతుందని, ఈ సినిమాపై తనకెంతో నమ్మకముందని తెలిపారు. మీ పెళ్లిపై వార్తలొస్తున్నాయి కదా అని ఓ రిపోర్టర్ అడగ్గా, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించారు.
అయితే సాయి దుర్గ తేజ్ పెళ్లిపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో తేజ్ ప్రేమలో ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో సార్లు వార్తలు రాగా, వాటిని తేజ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నాడు. అయితే రీసెంట్ గా సాయి దుర్గ తేజ్, తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ పెళ్లి బాధ్యతల్ని మేనమామ చిరంజీవి తీసుకున్నారని, అన్నదమ్ముల కోసం విదేశాల్లో చదువుకుని సెటిల్ అయిన ఇద్దరు అమ్మాయిలను చూశారని, వారు కూడా ఓకే అనడంతో మాటలు కూడా అయిపోయాయని వార్తలు రాగా, తాజాగా తేజ్ తన పెళ్లిపై స్వయంగా మాట్లాడి అందరికీ క్లారిటీ ఇచ్చారు.
ఇక సాయి తేజ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ హీరో సంబరాల ఏటి గట్టు మూవీ తో బిజీగా ఉన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుండగా, నెక్ట్స్ ఇయర్ లోనే తన పెళ్లి కూడా ఉంటుందని చెప్పడంతో 2026 మెగా హీరోకు ఎంతో కీలకం కానుందని అర్థమవుతుంది.


















