రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఇందులో భాగంగా… దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్ ను ఆయన విడుదల చేశారు.
అవును… ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక రూ.100 నాణెం, స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ నాణెంపై సింహంపై కూర్చున్న భారతమాత చిత్రం ఉండగా.. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా స్వయంసేవకులు ఆమె ముందు నమస్కరిస్తున్నారని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో… జాతీయ సేవలో సంస్థ చారిత్రాత్మక పాత్రను సూచిస్తూ, 1963 గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్న ఆరెస్సెస్ స్వయంసేవకులను పోస్టల్ స్టాంపులో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ.. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆరెస్సెస్ కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆరెస్సెస్ కృషి చేస్తోందన్నారు.
ఇదే సమయంలో… భారతదేశ ఐక్యత, సామాజిక సామరస్యానికి ఎదురవుతున్న ముప్పుల గురించి హెచ్చరించారు. ఇందులో భాగంగా… భిన్నత్వంలో ఏకత్వం ఎల్లప్పుడూ భారతదేశ ఆత్మ అని.. ఈ బలం విచ్ఛిన్నమైతే దేశం బలహీనపడుతుందని అన్నారు. ఇదే క్రమంలో.. సామాజిక సామరస్యానికి చొరబాటుదారుల నుండి పెద్ద ముప్పు ఎదురవుతుందని తెలిపారు.
ఇదే క్రమంలో… ఆరెస్సెస్ చేసే ప్రతి పనిలో ‘నేషన్ ఫస్ట్’ అనేది కన్పిస్తోందని చెప్పిన ప్రధాని మోడీ… గతంలో సంస్థ స్ఫూర్తిని అణచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయని అన్నారు. అయినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని ఆరెస్సెస్ నిలబడిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా… ‘రేపు విజయదశమి.. చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం, అబద్ధాలపై నిజం, చీకటిపై వెలుగు విజయాన్ని సూచించే పండుగ. 100 సంవత్సరాల క్రితం ఈ గొప్ప రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఒక సంస్థగా స్థాపించబడటం యాదృచ్చికం కాదు’ అని ప్రధాని మోడీ అన్నారు.