దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. అత్యంత సంపన్న సీఎం జాబితాలో అగ్రస్థానంలో ఆయన నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచినట్లుగా తాజాగా వెల్లడైన నివేదిక వెల్లడించింది. ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఆస్తుల విలువను మదింపు చేశారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ రూపొందించిన రిపోర్టు ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
దేశ వ్యాప్తంగా మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో టాప్ వన్ లో చంద్రబాబు.. టాప్ 2లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం నిలిచారు. రూ.931 కోట్ల ఆస్తులతో చంద్రబాబు టాప్ లో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తులు రూ.332 కోట్లుగా తేల్చారు. ఇక.. జాబితాలో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఆమె తన ఆస్తుల లెక్కను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చిన దాని ప్రకారం కేవలం రూ.15 లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత సీఎంలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి అఫిడవిట్లను పరిశీలించిన నేపథ్యంలో ఈ వివరాల్ని వెల్లడించారు. మమతా బెనర్జీ కంటే కాస్త మెరుగైన స్థానంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిలిచారు. ఆయన ఆస్తులు రూ.55 లక్షలుగా పేర్కొన్నారు. ఒమర్ కంటే పైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నారు. ఆయనకు రూ.కోటి మేర ఆస్తులు ఉన్నట్లుగా తేల్చారు.
దీదీ విషయానికి వస్తే ఆమె తన వద్ద కేవలం 9 గ్రాములు బంగారం మాత్రమే ఉందని పేర్కొన్నారు. తన మీద స్థలం కానీ.. ఇల్లు కానీ లేదని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1630 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చంద్రబాబు.. అరుణాచల్ ప్రదేశ్ సీఎంల ఆస్తులే రూ.1260 కోట్లు కావటం గమనార్హం. మొత్తం 31 మందిలో 77 శాతం ఆస్తులు మొదటి ఇద్దరి వద్దే ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.