ఎయిటీస్ క్లాస్ రీయూనియన్ పార్టీ పేరుతో మేటి తారలంతా ఓచోట చేరితే ఎలా ఉంటుందో ప్రతియేటా చూస్తున్నదే. సౌత్ దిగ్గజ తారలంతా కలిసి గ్రూప్ గా ఓ చోట చేరి వయసుతో సంబంధం లేకుండా రచ్చ రచ్చ చేస్తుంటారు. స్టార్లంతా గ్రూప్ గా ఫోటోలు దిగి వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాల్లోను షేర్ చేస్తున్నారు. ఈసారి కూడా 2025 రీయూనియర్ పార్టీ అద్భుతంగా సాగింది. ఈ పార్టీ కోసం తారలు ఉపయోగించిన డ్రెస్ కోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఈసారి స్పెషల్ గ్రూప్ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. అయితే ఇదే పార్టీ నుంచి మరో ఛమక్కు లాంటి ఫోటో అభిమానుల్లో ఉత్సుకత రేకెత్తించింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడగానే `కొండవీటి దొంగతో బొబ్బిలి రాజా` ఫ్రేమ్ ఫెంటాస్టిక్! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఒకే ఫ్రేమ్ లో పరిశ్రమ మూల స్థంబాలు చిరంజీవి- వెంకటేష్ కనిపించేసరికి ఫ్యాన్స్ లో ఒకటే ఎగ్జయిట్ మెంట్ పెరిగింది. మేటి కథానాయకులు ఎంపిక చేసుకున్న డ్రెస్ కోడ్ – థీమ్ మాసీగా ఐ-క్యాచీగా ఆకట్టుకుంది.
చిరు పేరుకు తగ్గట్టే `చిరుత లుక్` లో కనిపించారు. ఎంపిక చేసుకున్న డిజైనర్ షర్ట్ చిరుతపులి శరీరాకృతిని గుర్తు చేస్తుంటే, అభిమానులను తిరిగి `కొండవీటి దొంగ` రోజుల్లోకి వెళ్లారు. అక్కడ మరపురాని జ్ఞాపకాలెన్నో. సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాస్టార్ అడవి బిడ్డలను ఆదుకునే ఆపద్భాందవుడిగా కనిపించారు. మరో రాబిన్ హుడ్ లా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు చిరు. ఈ ఫోటో ఫ్రేమ్ లో చిరు పక్కనే వెంకీ మామ కూడా బొబ్బిలి రాజా లుక్ లో ఎంతో స్పెషల్ గా కనిపించారు. వెంకీ ట్రేడ్ మార్క్ హ్యాట్, పులిని ప్రింట్ చేసిన వైట్ టీ షర్ట్ పై కోట్ ధరించి మాస్ రాజా వారిని తలపించాడు. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన `బొబ్బిలిరాజా` సినిమాలో పొగరుమోతు రాజేశ్వరి అత్తకు ముకుతాడు వేసి రాణిని పెళ్లాడే చిలిపి రాజాగా వెంకటేష్ నటన ఎంతగానో ఆకట్టుకుంది. బి.గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మాటలు, ఇళయరాజా సంగీతం ప్రధానబలం. ఆరోజుల్లోనే ఇది బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ చిత్రంగా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాతోనే బాలీవుడ్ అందగత్తె దివ్యభారతి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
యాథృచ్ఛికంగా అయినా చిరు- వెంకీ ఇలా పార్టీలో కలిసారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న `మన శివశంకర వరప్రసాద్ గారు` చిత్రంలో వెంకీ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని కథనాలొచ్చాయి. ఈసారి పెద్ద తెరపై చిరు-వెంకీ కాంబినేషన్ ని చూడాలనే అభిమానులు ఆశ ఈ సినిమాతో నెరవేరుతోంది. ఈ అక్టోబర్ నుంచి వెంకీతో సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుందని కథనాలొచ్చాయి. మొత్తానికి కొండవీటి దొంగ – బొబ్బిలి రాజా కలయిక అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది.