వన్డే ప్రపంచకప్.. భారత్ ఈ కప్ నెగ్గి అప్పుడే 15 ఏళ్లు కావొస్తోంది.. 28 ఏళ్ల నిరీక్షణ అనంతరం 2011లో ప్రపంచ కప్ అందించాడు కెప్టెన్ ధోనీ. సొంతగడ్డపై 2023లో అందినట్లే అంది చేజారింది.. ఇక 2027లో మంచి అవకాశం..! దీనికి కారణం.. ప్రపంచంలోనే మరే ఇతర జట్టు ప్రస్తుతం టీమ్ ఇండియా స్థాయిలో పటిష్ఠంగా లేవు. మరో రెండేళ్ల వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల స్టార్ ఆటగాళ్లు చాలామంది రిటైర్ కావడమో, పదును తగ్గడమో ఖాయం. కొత్త కెప్టెన్ శుబ్ మన్ సారథ్యంలో యువకులు, గొప్ప అనుభవం ఉన్నవారితో అప్పటికి టీమ్ ఇండియా మరింత బలోపేతం అవుతుందని చెప్పొచ్చు. ఈ అనుభవం ఉన్నవారు ముఖ్యంగా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.
ప్రపంచ వన్డే క్రికెట్ లో పదివేల పరుగులు సాధించి ఇంకా కొనసాగుతున్న ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు రోహిత్, కోహ్లి. నిరుడు టి20 ప్రపంచ కప్ అనంతరం టి20లకు, ఈ ఏడాది టెస్టుకు వీరు వీడ్కోలు పలికారు. కేవలం వన్డేల్లో కొనసాగుతూ అది కూడా 2027 ప్రపంచ కప్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ, ఆ ఫార్మాట్ లోనూ వీరు రిటైర్ అవుతారంటూ అనూహ్యంగా మంగళవారం కథనాలు వచ్చాయి. దీనికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు కూడా కారణం అయ్యాయి.
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ముందు రోహిత్, కోహ్లి అనూహ్యంగా రిటైర్ కావడానికి గంభీర్, సెలక్టర్లు ముఖ్య కారణం అనేది పైకి తెలియని విషయం. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో 0-3 క్లీన్ స్వీప్, ఆపై ఆస్ట్రేలియా టూర్ లో వైఫల్యం ఈ దిగ్గజాల వీడ్కోలుకు కారణంగా మారింది. ఒకవేళ రిటైర్ కాకుంటే.. జట్టులోకి ఎంపిక కూడా కష్టమే అనే సంకేతం వెళ్లడంతోనే రోహిత్, కోహ్లి టెస్టుల నుంచి తప్పుకొన్నారు. మళ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముంగిట రోహిత్ కెప్టెన్సీని గిల్ కు ఇచ్చారు. ఈ దెబ్బకు రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ చర్చ మొదలైంది. తాజాగా ఇదే విషయంలో గంభీర్ స్పందిస్తూ.. మొహమాటం లేకుండా చెప్పాడు. వన్డే ప్రపంచ కప్ రెండేళ్ల తర్వాత ఉందని, అంత దూరం కంటే ఆస్ట్రేలియా టూర్ గురించి ఆలోచించాలని అన్నాడు. ఆసీస్ టూర్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నట్లు ముగింపు ఇచ్చాడు. అంటే.. ఈ టూర్ లో రాణించకుంటే రోహిత్, కోహ్లి ఇక తప్పుకోవాల్సి ఉంటుందని అర్థం.
రోహిత్, కోహ్లికి ఆసీస్ టూర్ ఆఖరు అనేలా గంభీర్ వ్యాఖ్యలు వేరే అర్థం తీయడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లానే నేరుగా స్పందించారు. ఆ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లని, ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలకంగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. వారు జట్టులో ఉంటేనే చాలా మేలు జరుగుతుందని.. ఇక రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల ఇష్టం అని వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియా టూర్ మాత్రం చివరిది కాదని.. ఆ ఆలోచనే అవసరం లేదని స్పష్టం చేశారు. మొత్తానికి సంచలనం వివాదం కాకుండా వాతావరణాన్ని తేలిక పరిచారు.