దేశీయ దిగ్గజ సంస్థల్లో అత్యంత కీలకమైన.. విలువైన కంపెనీలలో రిలయన్స్ ముందు ఉంటుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికం ఫలితాల్లో రిలయన్స్ దుమ్ము రేపింది. సదరు సంస్థ చరిత్రలోనే తొలిసారి ఆకర్షణీయమైన లాభాల్ని ప్రకటించింది. ఒక క్వార్టర్ లో అత్యధికంగా రూ.26,994 కోట్ల రికార్డు స్థాయి నికర లాభాన్ని ఆర్జించినట్లుగా పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి రూ.15,138 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది లాభాల శాతాన్ని ఈ ఏడాది శాతంతో లెక్కిస్తే ఇది కాస్తా 78 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు అవుతుంది.
ఆర్ఐఎల్ టెలికాం.. డిజిటల్ బిజినెస్ ల విభాగం.. జియో ప్లాట్ ఫామ్స్ క్యూ1 నికర లాభం 25 శాతం వృద్ధితో రూ.7110 కోట్లు కాగా.. స్థూల ఆదాయం 19శాతం పెరిగి రూ.41,054కోట్లకు చేరినట్లుగా పేర్కొంది. మొబిలిటీ.. హోమ్స్ విభాగంలో చందాదారులు పెరగటం.. డిజిటల్ సర్వీసుల వ్యాపారం బలపడటంతో పెద్ద ఎత్తున లాభాలకు కారణమైందని చెప్పాలి. 7.4 మిలియన్ సబ్ స్క్రైయిబర్లతో జియో ఫైబర్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫిక్సెడ్ వైర్ లెస్ సంస్థగా అవతరించినట్లుగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
జియో 5జీ వినియోగదారులు 20 కోట్లు దాటారని.. 2 కోట్ల హోమ్ కనెక్ట్స్ చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇక..రిలయన్స్ రిటైల్ విభాగంలో భాగమైన రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ1లో 28 శాతం దూసుకెళ్లటం విశేషం. దీంతో పాటు కంపెనీకి చెందిన వివిధ విభాగాలు వృద్ధి కూడా రిలయన్స సంస్థ గరిష్ఠలాభాల్ని సాధించేందుకు సాయం చేశాయని చెప్పాలి. ఒక్క చమురు వ్యాపారంలోనే లాభాలు తగ్గాయి. ఐపీఎల్ సీజన్ దెబ్బతో జియో స్టార్ రూ.11,222 కోట్ల ఆదాయాన్ని.. రూ.1017 కోట్ల ఎబిటాను నమోదు చేసింది. ఈ భారీ లాభాలతో ఏప్రిల్ – జూన్ మూడు నెలల కాలానికి ఒక్కో షేరుకు రూ.19.95 లాభం దక్కింది. మూడు నెలల కాలంలో రిలయన్స్ చరిత్రలో ఇదే గరిష్ఠంగా చెప్పొచ్చు.