క్రికెటర్ యజ్వేంద్ర చాహల్- కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమ వివాహం గురించి తెలిసిందే. ఈ జంట కోవిడ్ ప్రారంభ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ధనశ్రీ వర్మ వద్ద డ్యాన్స్ నేర్చుకునేందుకు శిష్యుడిగా చేరాడు చాహల్. ఆ సమయంలో ఇద్దరి మధ్యా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ డ్రీమ్ వెడ్డింగ్ కేవలం నాలుగేళ్లలోనే బ్రేకప్ కి దారి తీసింది. ఇద్దరి మధ్యా కలతలు తారా స్థాయికి చేరుకోవడంతో ఈ జంట కాపురం మీడియా హెడ్ లైన్స్ లో నలిగిపోయింది. రకరకాల ఫిర్యాదులు, పుకార్ల నడుమ చివరికి పరస్పర ఒప్పందంతో విడాకుల ప్రక్రియ ముగిసింది.
ధనశ్రీ ప్రస్తుతం సినీకెరీర్ పై దృష్టి సారించగా, చాహల్ క్రికెట్ పై ధ్యాస పెట్టాడు. ఎనర్జిటిక్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ ఇటీవల `రైజ్ అండ్ ఫాల్` అనే రియాలిటీ షోలో పార్టిసిపెంట్ గా చేరింది. ఈ షోలో ప్రతిసారీ భర్త నుంచి ధనశ్రీ విడాకులు తీసుకోవడానికి దారి తీసిన విషయాలపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అష్నీర్ గ్రోవర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటికే మాజీ భర్త గురించి ధనశ్రీ చాలా విషయాలు చెబుతోంది.
తాజాగా ధనశ్రీ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. షోలో సహ పోటీదారు కుబ్రా సైథ్ నేరుగా ధనశ్రీని ప్రశ్నిస్తూ, అసలు మీ మధ్య ఇక కుదరదు అని, ఈ పెళ్లి ముందుకు సాగదు అని అనిపించిన మొదటి సందర్భం గురించి చెప్పాలని ప్రశ్నించారు. దానికి వెంటనే ధనశ్రీ నుంచి రిప్లయ్ వచ్చింది. “పెళ్లయిన ఏడాదిలో రెండవ నెలలోనే అతడు దొరికిపోయాడు“ అని ధనశ్రీ ప్రతిస్పందించింది. అయితే యజ్వేంద్ర ఏ విషయంలో దొరికిపోయాడు? అన్నది మాత్రం ధనశ్రీ చెప్పలేదు.
అయితే ధనశ్రీ తనపై భరణం విషయంలో చాలా తప్పుడు ప్రచారం జరిగిందని, తాను అలాంటి వాటికి స్పందించనని కూడా చెప్పింది. పరస్పర అంగీకారం కారణంగానే వెంటనే విడాకుల ప్రక్రియ ముగిసిందని వెల్లడించింది. ఓవైపు చాహల్ తో స్నేహం కొనసాగిస్తున్నానని చెబుతున్న ధనశ్రీ రియాలిటీ షో వేదికగా చాహల్ పరువు తీయడానికి పూనుకోవడం అతడి అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ముగిసిన బంధంపై ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ రియాలిటీ షో కోసం టీఆర్పీ గేమ్ ఆడుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మాజీ భర్తను గౌరవిస్తానని చెబుతున్న ధనశ్రీ ఇలా అనూహ్యంగా ప్రవర్తించడంపై చాహల్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. పబ్లిక్ వేదికలపై ఇలాంటి ప్రవర్తన సరి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు.