ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైసీపీ నేతలు గత పదనాలుగు నెలలుగా విపరీతంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీకి చెందిన నేతల మీద కేసులు అరెస్టులు జైళ్ళలో నిర్బంధాలు ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం మేరకే జరుగుతున్నాయని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇక గ్రౌండ్ లెవెల్ లో పార్టీ క్యాడర్ మీద స్థానిక నాయకుల మీద వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కూడా ఫిర్యాదు చేస్తోంది. అయితే ఇపుడు వైసీపీ కూడా రెడ్ బుక్ కాదు కానీ కౌంటర్ అన్నట్లుగా ఒక కొత్త యాప్ ని తీసుకుని వస్తోంది. ఈ విషయాన్ని జగన్ పీఏసీ సమావేశంలో ప్రకటించారు.
వైసీపీలో ఉన్న క్యాడర్ కానీ లీడర్లు కానీ తాము అధికారుల వల్ల పోలీసుల వల్ల లేక ఏ నాయకుడి వల్ల అయినా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఉంటే కనుక వైసీపీ కొత్తగా తీసుకుని వస్తున్న యాప్ లో మొత్తం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీలుంటే వీడియో ఆడియో క్లిప్పింగ్స్ ని కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా ఫిర్యాదు చేసిన చేసి బటన్ నొక్కితే ఆ యాప్ లోని ఫిర్యాదు కాస్తా వెంటనే వైసీపీ డిజిటల్ లైబ్రరీలో నమోదు అవుతుంది. అలా పార్టీ కేంద్ర కార్యాలాయనికి ఆ ఫిర్యాదు చేరుతుంది.
పీఏసీ సమావేశంలో ఈ యాప్ గురించి చెబుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విత్తుని నాటారని అది వృస్క్షం అవుతోందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీని వేధించిన ఒక్కొక్కరిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. డిజిటల్ లైబ్రరీలో పొందుపరచిన ప్రతీ ఫిర్యాదుని బయటకు తీసి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు ఈ విషయంలో ఎక్కడా తగ్గేది ఉండదని అన్నారు ఎందుకంటే ఈ కల్చర్ ని టీడీపీ తీసుకుని వచ్చింది కాబట్టి వారే బాధ్యులు అవుతారని కూడా స్పష్టం చేశారు.
ఇక ఏపీలో రాజకీయాలు చూస్తూంటే అధికారం కోరుతోంది ప్రతీకారాల కోసమేనా అన్న చర్చ అయితే ఉంది. వారు చేశారని వీరు వీరు చేశారని వారు రివెంజ్ పాలిటిక్స్ కి తెర లేపుతున్నారు అని అంటున్నారు. అయితే తాము మంచిగా ఉంటే రెచ్చగొడుతున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. తమ ప్రమేయం లేకుండానే కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అంటున్నారు. అందుకే తాము తీసుకుని రాబోతున్న యాప్ పవర్ ఫుల్ గా వర్క్ చేస్తుందని ముందే చెబుతున్నారు.
ఏపీలో ఎలా చూసుకున్నా మరో నాలుగేళ్ళ వరకూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అయితే ఇంతకాలం తట్టుకుని వైసీపీ వారు రాజకీయం చేయాలి. అందుకే గతంలో జగన్ పదే పదే వారికి ఒకటే చెబుతూ వచ్చారు. మీరే ఒక బుక్ ని పెట్టుకుని వేధించిన వారి వివరాలు రాయాలని కోరారు అయితే అది అంత వర్కౌట్ అయినట్లుగా లేదని అంటున్నారు. పైగా మరింతంగా వేధింపులు పెరిగాయనై క్యాడర్ గోల పెడుతోంది. దాంతో అధినాయకత్వం అన్నీ ఆలోచించి ఇపుడు ఒక యాప్ ని తీసుకుని వచ్చింది అని అంటున్నారు. ఒక విధంగా ఈ యాప్ ని ప్రచారం చేస్తే వేధింపులు తగ్గుతాయన్న వ్యూహం ఉందని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలు భవిష్యత్తు అధికారం గురించి ఎవరూ ఆలోచించరని, ఇపుడు ఏమిటి అన్నదే రాజకీయాల్లో ముఖ్యమని ఆ విధంగా చూస్తే వైసీపీ యాప్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.