రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కొంతమంది వివాదాలకు కేంద్రంగా మారితే మరికొందరు మాత్రం పనితీరులో మెరుగైన విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరు సీమ టపాసుల మాదిరిగా అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. రాయల సీమ రాజకీయ రత్నాలుగా పేరుతెచ్చుకుంటున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాయలసీమలోని ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తూ రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రహదారులు నిర్మించే విషయంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..
అదేవిధంగా మంత్రి సవిత కూడా అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల పనితీరును మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టళ్లను కూడా మెరుగుపరుస్తున్నారు. ఇక రాయలసీమకే చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వారిలో పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన పల్లె సింధూర రెడ్డి, సింగనమల నియోజకవర్గం చెందిన మహిళా ఎమ్మెల్యే సహా దాదాపు 22 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందన్నది ప్రభుత్వానికి అందిన సమాచారం.
ఇటు అభివృద్ధి పరంగా అటు సంక్షేమం పరంగా కూడా ప్రజలకు చెరువగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. వివాదాస్పద ఎమ్మెల్యేలు హైలెట్ అవుతుండగా పనితీరును మెరుగుపరుచుకుని ప్రజలకు చేరు అవుతున్న ఎమ్మెల్యేల పనితీరు మాత్రం పెద్ద హైలెట్ కావడం లేదు. ఈ విషయంలో సదరు ఎమ్మెల్యేలు కొంత దృష్టి పెట్టి.. చేస్తున్న పనికి, అభివృద్ధికి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
పనులు చేయడమే కాదు దానికి సంబంధించిన ప్రచారాన్ని కూడా చేసుకోవాలని ఇటీవల సీఎం చంద్ర బాబు ఎమ్మెల్యేలకు సూచించారు. వివాదాస్పద నాయకులు ఎలా ఉన్నా పని తీరులో దూసుకుపోతున్న వారు మాత్రం హైలెట్ కాలేకపోతున్నారన్నది సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో పనిచేస్తున్న వారు తమ పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించటం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా ఈ తరహా వెనుకబాటు నుంచి బయటపడే అవకాశం ఉందన్నది చంద్రబాబు చెబుతున్న మాట, మరి ఏం చేస్తారనేది చూడాలి.