మాస్ మహరాజ్ రవితేజ ఈ నెల చివర్లో మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ధమాకా కాంబో కాబట్టి మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ బాగున్నాయి. సితార నాగ వంశీ మాస్ రాజా ఫ్యాన్స్ కి మరో మస్త్ జబర్దస్త్ ఎంటర్టైనర్ అందిస్తాడని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా వచ్చాయి.
రవితేజతో కూడా అలాంటి ఒక ఎంటర్టైనింగ్ సినిమాతోనే వస్తున్నాడని తెలుస్తుంది. రవితేజ కిషోర్ తిరుమల సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీలో రవితేజకు జతగా కెతిక శర్మ, ఆషిక రంగనాథ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. సంక్రాంతికి ఈసారి రవితేజ సినిమాను ఎలాగైనా తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. పోటీ ఉన్నా సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
ఈ సినిమా తర్వాత రవితేజ శివ నిర్వాణ కాంబో సినిమా ఉంటుందని టాక్. లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ శివ ఖుషి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రవితేజతో సినిమా అది కూడా ఒక థ్రిల్లర్ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు రవితేజ కళ్యాణ్ శంకర్ కాంబోలో ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో కళ్యాణ్ శంకర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు రవితేజతో ఒక సూపర్ హీరో ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.
ధమాకా తర్వాత రవితేజ చేస్తున్న సినిమాలన్నీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కానీ అతను ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు. ఒక దానికి మించి మరొకటి అనేలా రవితేజ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి నెక్స్ట్ రాబోతున్న సినిమాలు ఆ కాంబినేషన్స్ మాస్ రాజా ఫ్యాన్స్ కి కచ్చితంగా మంచి ట్రీట్ అందిస్తాయని చెప్పొచ్చు.
రవితేజ నెక్స్ట్ సినిమాలతో పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నారని అనిపిస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ మాస్ స్టామినా ఏంటో తెలుసు కాబట్టి మళ్లీ ఒక సూపర్ హిట్ పడితే ఆయన ఫాం లోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఆ సూపర్ హిట్ ఏది అవుతుంది అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.