రవితేజ మళ్లీ వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్నాడు. తీవ్రమైన ఒడిదొడుకుల మధ్య ఉన్న సమయంలో వచ్చిన క్రాక్ మూవీ రవితేజను నిలబెట్టింది. ఆ తర్వాత ధమాకా సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లు సాధించడంతో రవితేజ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ రవితేజ ధమాకా సినిమా హిట్ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేక పోయాడు. రవితేజ పనైపోయిందంటూ మరోసారి ఆయన యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా నెగటివ్ ప్రచారం జరిగిన ప్రతిసారి రవితేజకి లక్ కలిసి వచ్చి హిట్ పడ్డ సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ఆయన చేస్తున్న మాస్ జాతర సినిమాపై అంచనాలు ఉన్నాయి.
సామజవరగమన రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉంది. నిర్మాత నాగవంశీతో పాటు, అండర్ గ్రౌండ్‌లో చాలా మంది కథ విన్న తర్వాత, చాలా మార్పులు జరిగిన తర్వాత సినిమా పట్టాలెక్కుతోంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ నుంచి కూడా సినిమా కథకు ఓకే రావాల్సి ఉంటుంది. ఆయన చేతిలో పడ్డప్పుడు తనవంతు ఇన్‌పుట్స్ ఇస్తాడని అంటారు. ఆయన ఫ్యామిలీ కూడా ఈ సినిమా నిర్మాణంలో ఉంది. కనుక ఆయన బాధ్యతాయుతంగా స్క్రిప్ట్‌లో సూచనలు చేస్తాడట.
‘మాస్ జాతర’ విషయంలో కూడా సితార సినిమాలు అన్నింటికి జరిగిన విధంగానే స్క్రిప్ట్ వర్క్ మొదలుకుని షూటింగ్ వరకు త్రివిక్రమ్ సూచనలు అందుతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఆ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ఇన్ సైడ్ టాక్ ప్రకారం మాస్ జాతర సినిమా పట్ల రవితేజ చాలా నమ్మకంతో ఉన్నాడు. పక్కా కమర్షియల్ ధమాకా మూవీగా మాస్ జాతర ఉంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. రవితేజతో ఈ సినిమాలో శ్రీలీల నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా సినిమా హిట్ కావడంతో వీరిద్దరినీ హిట్ పెయిర్‌గా ప్రేక్షకులు భావిస్తున్నారు. దాంతో మాస్ జాతర సినిమాకు అది కలిసి వచ్చే అంశం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాన్ని సొంతం చేసుకుంటున్న కారణంగా వారిని లక్కీ సంస్థగా పిలుస్తున్నారు. సితార వారి లక్ కలిసి వస్తే రవితేజకు మాస్ జాతర సినిమా హిట్ కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాస్ జాతర సినిమాలో రవితేజ రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు పెద్ద హీరో ఇలా రైల్వే పోలీస్ పాత్రలో కనిపించలేదు. కనుక కథ చాలా కొత్తగా ఉంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. వచ్చే నెల 27న వినాయక చవితి సందర్భంగా మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ వరుస ఫ్లాప్స్‌కు ఈ జాతర బ్రేక్ వేసేనా చూడాలి.