ఏపీ సీఎం చంద్రబాబు అంటే..ఐటీ విప్లవానికి మారు పేరు. తాజాగా ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కూడా చెప్పారు. సైబరాబాద్, హైటెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబేనని, దీనిని తమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కొనసాగించారని వెల్లడించారు. దీనివల్లే హైదరాబాద్‌కు ఐటీలో మంచి పేరు కూడా వచ్చిందన్నారు. అయితే.. చిత్రంగా అదే బుధవారం నాడు.. సీఎం చంద్రబాబు ఐటీవిప్లవంలో ఆశ్చర్య పోయే ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత రతన్ టాటా కంపెనీ.. ఏపీలోని మంగళగిరి, విజయవాడ, విశాఖ, అనంతపురం, రాజమండ్రిలలో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వీటిని చంద్రబాబు స్వయంగా బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మంగళగిరిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను లాంభనంగా ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అంతేకాదు.. ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. యువతలో నైపుణ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. వాటన్నింటికీ.. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్(ఆవిష్కరణ) హబ్ కేంద్రంగా పనిచేసి.. వెలుగులోకి తీసుకువస్తుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తుంది. లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది.
యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా.. తామే ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదిగేలా ఈ కేంద్రాలు దోహదపడతాయి. ఇదిలావుంటే.. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత.. ఆయన కేంద్రంలోని రోబో హాల్‌లోకి ప్రవేశించారు. అప్పటికే అభివృద్ధి చేసిన రోబో.. చంద్రబాబుకు ఎదురేగి.. వచ్చింది.. ఆయనను చూడడమే కాదు.. రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు తాను చూడలేదన్నారు. ఆ వెంటనే.. రోబోకు ఆయన ప్రతినమస్కారం చేశారు.
ఒక్క చంద్రబాబుకే కాకుండా.. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మంత్రులు, అధికారులకు కూడా రోబో నమస్కారాలు చేసింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. రోబో గురించి వినడమే తప్ప..తాను ఇప్పటి వరకు చూడలేదని.. ఇప్పుడు ఏపీకే ఈ సాంకేతిక వ్యవస్థ రావడం గర్వగా ఉందన్నారు. కాగా.. రోబో టెక్నాలజీలో కూడా.. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ యువతకు పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వనుంది. ఇక్కడ దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు.