ప్రేమించటం అంటే.. ప్రాణాలు తీయటమా అన్నట్లు కొందరి తీరు ఉంటోంది. తమను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెప్పినా.. పెళ్లి వద్దకు విషయం వచ్చిన తర్వాత దూరం జరిగితే అందుకు కారణం సవాలచ్చ ఉండొచ్చు. స్వార్థమే తప్పించి ఇంకేమీ ఉండదని అనుకోవటమూ తప్పే. ప్రేమించిన అమ్మాయి పక్కాగా పెళ్లి చేసుకోవాలని.. లేదంటే ప్రాణాలు తీసినా తప్పే లేదన్నట్లుగా వ్యవహరించే సైకో ప్రేమికులు కొందరు ఉంటారు. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ తోనే సంగారెడ్డి జిల్లాకు చెందిన రమ్య అనే యువతిని దారుణంగా హత్య చేశారు.
ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రేమించిన తర్వాత పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోని నేపథ్యంలో ప్రేమించినోడ్ని రమ్య పక్కన పెట్టిందని.. ఆ కోపంతో కక్ష కట్టిన ప్రవీణ్ కుమారు ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినా.. బతికిపోయాడు. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతోనే ఈ తరహా దారుణానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. మెదక్ జిల్లాకు చెందిన పాతికేళ్ల ప్రవీణ్ కుమార్.. బండ్లగూడలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే 23 ఏళ్ల రమ్యతో కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తన ప్రేమ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు ప్రవీణ్ కుమార్ చెప్పాడు. ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామని.. పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. అందుకు రమ్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
ఇటీవల కాలంలో రమ్య తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అప్పటి నుంచి రమ్య అతడ్ని దూరం పెడుతోంది. వారం రోజులుగా ప్రవీణ్ ఫోన్ చేస్తున్నా.. ఫోన్ కాల్ ఎత్తటం లేదు.దీంతో రగిలిపోయిన ప్రవీణ్.. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదన్నట్లుగా భావించి.. ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. సోమవారం ఉదయం రమ్య తల్లిదండ్రులకు ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. ఆమె ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
అనంతరం ఆవేశంతో ఆమెపై కత్తి దూసి.. గొంతు కోసి చంపాడు. తాను కూడా బతక్కూడదన్న ఉద్దేశంతో కత్తితో పొడుచుకున్నాడు. అయితే.. అతడి సూసైడ్అటెంప్టు ఫలించలేదు. ప్రస్తుతం ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రేమ పగను.. ప్రతీకారాన్ని పెంచుతుందా? ఒకవేళ అదే నిజమైతే.. అది ప్రేమ ఎంత మాత్రం కాదు. ప్రేమ త్యాగాన్ని కోరుతుందన్న మాటకు భిన్నంగా ప్రతీకారంతో ప్రాణాలు తీస్తున్నది ప్రేమ ఎంత మాత్రం కాదు. ప్రేమించినోళ్లు తమకు దక్కకుంటే ప్రాణాలు తీయాలన్న మైండ్ సెట్ ఉన్నోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.