గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన షూటింగ్ 50% పూర్తైందని రీసెంట్ గా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ పనుల్ని కూడా పూర్తి చేస్తోంది పెద్ది టీమ్.
రీసెంట్ గా మైసూర్ లో వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో టైటిల్ సాంగ్ ను షూట్ చేసిన పెద్ది టీమ్, ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదని, ఏదైనా షాట్స్ తాను అనుకున్న స్థాయిలో రాకపోతే వాటిని మళ్లీ మళ్లీ రీషూట్స్ చేస్తున్నారని, ఈ విషయంలో రామ్ చరణ్ కూడా డైరెక్టర్ కు సహకరిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.
కాగా రీసెంట్ గా పెద్ది మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న రత్నవేలు పెద్ది సినిమా అందరూ అనుకునేలా కాదని, బుచ్చిబాబు దీన్ని అంతకుమించి తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ సినిమాతో రామ్ చరణ్ తనలోని మరో యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించనున్నారని చెప్పిన రత్నవేలు పెద్ది సినిమా చాలా బాగా రూపు దిద్దుకుంటుందని, ఈ సినిమాలో చరణ్ మంచి యాక్టింగ్ ను కనబరుస్తున్నారని చెప్పారు.
ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్, స్టైల్, డిక్షన్ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని, ఈ మూవీ కోసం చరణ్ చాలా కొత్తగా మారిపోయారని, వాళ్లతో పాటూ తాను కూడా ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా షూట్ చేస్తున్నానని, స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో పాటూ పెద్ది కథ తననెంతో ఎగ్జైట్ చేయడమే దానికి కారణమని, కథ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు తాను కచ్ఛితంగా కొత్తగా ట్రై చేస్తానని, ఈ సినిమా కూడా రంగస్థలం లానే స్పెషల్ అని రత్నవేలు పెద్దిపై ఉన్న అంచనాల్ని ఇంకాస్త పెంచారు.
పెద్ది గురించి అందరూ చెప్తున్న దాన్ని చూస్తుంటే ఈ సినిమాను బుచ్చి నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని, వాళ్లు చెప్పింది చెప్పినట్టు జరిగితే మాత్రం పెద్ది రంగస్థలాన్ని మించే సినిమా అవడం ఖాయమని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.