ఓ పదేళ్ల కిందట ఇండియన్ సినిమా మీద 200-300 కోట్ల బడ్జెట్ పెట్టడం కూడా చాలా రిస్కీ అనిపించేది. దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోనూ మార్కెట్ ఉన్న హిందీ సినిమాలకు సైతం అంత బడ్జెట్ పెట్టాలంటే సంకోచించేవాళ్లు. అలాంటి టైంలో రూ.250 కోట్ల దాకా ఖర్చు పెట్టి ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా తీసింది రాజమౌళి బృందం. గొప్ప ఔట్ పుట్ రాబట్టినప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అని టీం ఎంతో కంగారు పడింది. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో ‘బాహుబలి’ టీంలోనే కాదు.. మొత్తంగా ఇండస్ట్రీలోనే ఎంతో ధీమా వచ్చింది.
అక్కడి నుంచి వందల కోట్ల బడ్జెట్లు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఐదారొందల కోట్లలో తెరకెక్కే సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్-అట్లీ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లు అంటున్నారు. రాజమౌళి-మహేష్ బాబు చిత్రం మీద ఏకంగా వెయ్యి కోట్లు పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి వెయ్యి కోట్ల బడ్జెట్టే రికార్డు అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లుగా నిర్మాత ప్రకటన చేయడం భారతీయ సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.
రెండు భాగాలు అయినా సరే.. ఒక ఇండియన్ సినిమా మీద ఈ దశలో 4 వేల కోట్లు పెట్టడం ఎంతమేర వర్కవుట్ అవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తోంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి-2’ రికార్డు నెలకొల్పింది. ఆ సినిమా ఎనిమిదేళ్ల ముందు రూ.1700 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి కానీ.. దానికి దగ్గరగా కూడా వెళ్లలేకపోయాయి. రాజమౌళి సైతం ‘ఆర్ఆర్ఆర్’తో ఆ రికార్డును కొట్టలేకపోయాడు. ‘బాహుబలి-2’ స్థాయి హైప్ తెచ్చుకోవడం మరో సినిమాకు అసాధ్యం అనే అభిప్రాయం బలంగా ఉంది.
రామాయణ కథకు ఉన్న పొటెన్షియాలిటీ, మేకింగ్ మీద ఉన్న నమ్మకం నిర్మాతలతో భారీ బడ్జెట్ పెట్టడానికి పురిగొల్పి ఉండొచ్చు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా మీద అంచనాలను పెంచిన మాటా వాస్తవం. కానీ నిర్మాత ప్రకటించిన బడ్జెట్ వర్కవుట్ కావాలి.. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి.. లాభాలు రావాలి అంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలే జరగాలి. ‘రామాయణం’ పార్ట్-1 విడుదల కావడానికి ఇంకా 15 నెలల సమయం ఉంది. ఈలోపు అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి. సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంకా అంచనాలు పెరిగేలా చేయాలి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు మెరుగుపడాలి. భారతీయ ప్రేక్షకులనే కాక అంతర్జాతీయంగా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి. ఇవన్నీ జరిగి ముందు ‘రామాయణం-1’ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కావాలి. అది కనీసం 1500 కోట్ల మేర బిజినెస్ చేసి, 2 వేల కోట్లను మించి వసూళ్లు రాబడితేనే.. రెండో భాగానికి రావాల్సిన హైప్ వస్తుంది. రెండు భాగాల మీద పెడుతున్న 4 వేల కోట్ల బడ్జెట్ వర్కవుట్ అవుతుంది.