సుప్రీం కోర్టులో ఒక అవాంచనీయ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ ఉన్న డయాస్ మీదకు సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయవాది అయిన రాకేష్ కిశోర్ తన బూట్ తో దాడికి ప్రయత్నించారు. అయితే ఆ బూట్ చీఫ్ జస్టిస్ డయాస్ దాకా వెళ్ళలేదు, వేరే చోట పడిపోయింది. అనంతరం భద్రతా సిబ్బంది రాకేష్ కిశోర్ ని పట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఘటన మీద రాకేష్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మత్తులో ఉండో మైకంలో ఉండో ఈ దాడికి యత్నించలేదని తాను పూర్తి స్పృహతోనే చేశాను అన్నారు. జస్టిస్ గవాయ్ తీరు మీద విసుగుచెంది ఇలా చేశాను అన్నారు. జస్టిస్ గవాయ్ ఇటీవల కాలంలో అనుసరిస్తున్న దాని మీద ఆగ్రహంతో ఇలా చేశానని అన్నారు. సుప్రీం కోర్టులో సెప్టెంబర్ 16న ఒక పిటిషన్ వచ్చిందని మధ్యప్రదేశ్ లోని విష్ణువు విగ్రహం విషయంలో వచ్చిన ఆ పిటిషన్ ని విచారించే సందర్భంగా గవాయ్ ఎగతాళి చేశారని ఆయన అలా చేయవచ్చా అని ప్రశ్నించారు. వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రార్ధించు అనడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం విషయంలో పిటిషన్ వచ్చిందని ఆ కేసు విచారణ సందర్భంగా ఈ విధంగా చేస్తారా అని రాకేష్ కిశోర్ మండి పడ్డారు.
తాను గవాయ్ మీద దాడి చేసినందుకు భయం కానీ పశ్చాత్తాపం కానీ ఏవీ లేవని రాకేష్ కిశోర్ స్పష్టం చేశారు. సనాతన ధర్మమే ఆ విధంగా తన చేత చేయించింది అన్నారు. దేవుడే అలా గవాయ్ మీద దాడి చేయించారు అని ఆయన అన్నారు. గవాయ్ మీద దాడితో ఆయన దళితుడని అంతా అంటున్నారని కానీ బౌద్ధమతం స్వీకరించిన ఆయన దళితుడు ఎలా అవుతారని రాకేష్ ప్రశ్నిచారు. తాను మాత్రం దళితుడినే అన్నారు. తాను సనాతన ధర్మం విషయంలో ఆయన తీరునే తప్పు పడుతున్నాను అన్నారు.
ఇదిలా ఉంటే గవాయ్ మారిషస్ వెళ్లి భారత రాజ్యాంగం మీద ప్రసంగాలు చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్న వారి మీద అక్కడ యోగీ ప్రభుత్వం బుల్డోజర్ ని ప్రయోగిస్తోందని దానిని గవాయ్ ఎలా తప్పు పడతారు అని కూడా రాకేష్ ప్రశ్నించారు. గవాయ్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన మొదట హిందువని సానాతన హిందూ ధర్మం నుంచే ఆయన కూడా వచ్చారని ఆ మీదట ఆయన బౌద్ధంలోకి మారారని రాకేష్ నిర్వచించారు.
ఇదిలా ఉంటే 71 ఏళ్ళ వృద్ధ న్యాయవాది రాకేష్ కిశోర్ గవాయ్ మీద బూట్ తో దాడి చేసిన వెంటనే సనాతన ధర్మాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. సనాతన ధర్మాన్ని విమర్శించినా సహించేది లేదని అన్నారు. ఇదిలా ఉంటే రాకేష్ కిశోర్ మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆయనను మూడు గంటల పాటు విచారించి పోలీసులు విడిచిపెట్టారు. అయితే సుప్రీం కోర్టుతో పాటు అన్ని చోట్ల ఆయన బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు అయింది. ఆయన ఇక మీదట న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయలేరు. కానీ సనాతన ధర్మం రక్షణ అంటూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తో ఒక్క రోజులోనే దేశంలో పాపులర్ అయ్యారు. మీడియాకి ఫోకస్ అయ్యారు. ఆయన తదుపరి అడుగులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.