రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు? ఏమవుతారో తెలియడం చాలా కష్టం. ఢిల్లీ పీఠం అధిరోహించడం కంటే ముందు కేజ్రీవాల్ పై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేది. మొదట్లో మంచి పాలన సాగించిన కేజ్రీవాల్ రాను రాను విమర్శలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత లిక్కర్ స్కాంలో పీకల్లోతు ఇరుకొన్ని సీఎం పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయల్లో చురుకుగా పాల్గొనే అవకాశం వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమి నుంచి ఆయనను ఎగువ సభకు పంపించాలన్న చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు పోటీ చేసే అవకాశంపై మళ్లీ ఊహాగానాలు తలెత్తుతున్నాయి. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉండచ్చని, ఇప్పటికే లుథియానా వెస్ట్ ఉప ఎన్నికల్లో గెలిచిన అరోరా స్థానంలో ఆయనే వెళ్లనున్నారని ఆప్, ఇండీ కూటమి నుంచి లీకులు వస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికకు అక్టోబర్ 13వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండగా, అక్టోబర్ 24న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతోంది.
కేజ్రీవాల్ ను రాజ్యసభకు పంపిస్తే కేంద్రంలో ఎన్‌డీయే ప్రభుత్వాన్ని జాతీయ అంశాలపై బలంగా ఢీకొట్టగలరని రాజకీయ ప్రముఖుల నుంచి విశ్లేషణలు ఉన్నాయి. అంతేకాదు.. ముందున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఆయన ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌లో ఆప్ ఆధిపత్యం ఉండడం వల్ల కేజ్రీవాల్‌కు పార్లమెంట్ రాజ్యసభ ద్వారానే జాతీయ వేదికలో మళ్లీ చురుగ్గా నిలబడే అవకాశం లభించనుంది.
అయితే, ఇవి కేవలం ఊహలేనా..? లేదంటే నిజం ఉందా..? అనేది చూడాలి. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. స్వయంగా కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలవ్వడం ఆ పార్టీని చాలా వరకు కుంగదీసింది. కేజ్రీవాల్ తన నియోజకవర్గంలో కేవలం మూడు వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోవడం ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ రాజ్యసభ వైపు అడుగులు వేయడం ద్వారా తన రాజకీయ కేరీర్‌ను మళ్లీ బలోపేతం చేసుకోవచ్చని అనుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే, అది ఆయనకే కాకుండా ఆప్ పార్టీ భవిష్యత్తుకు కీలకంగా మారుతుందని ప్రముఖులు విశ్లేసిస్తున్నారు. అయితే దీనిపై కేజ్రీవాల్ మాత్రం ఇప్పిటీ మీడియా ముందు ఎలాంటి విషయాలు చెప్పలేదు.