లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో తీవ్రంగా నిరాశ పరిచిన దర్శకుడు పూరి జగన్నాథ్ పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా మరో సినిమాను చేస్తున్నాడు. ఆయన అడిగితే ఒకప్పుడు టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలు డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయనతో సినిమా అంటే యంగ్ హీరోలు, కొత్త హీరోలు కూడా బాబోయ్ పూరితోనా అంటూ వెనకంజ వేస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ సేతుపతితో ఆయన సినిమాకు రెడీ అయ్యాడు. తెలుగులో హీరోల నుంచి మద్దతు లేకపోవడం వల్లే పూరి తమిళ హీరోతో సినిమాను చేస్తున్నాడు అంటూ పలువురు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాకు సంబంధించిన విషయాల గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన ఫలితంపై పెద్దగా నమ్మకం పెట్టుకోకుండా సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడని, అందుకు కారణం సినిమా కంటెంట్ అని, అంతే కాకుండా పాత్ర తీరు కారణంగా సినిమా చేసేందుకు ఓకే చెప్పి ఉంటాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ పాత్ర గురించి పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయాల గురించి పక్కన పెడితే షూటింగ్‌కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూరి గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ను వేయిస్తున్నారు. ఆ సెట్‌లో సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే సెట్ ను భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్ సీన్స్‌తో పాటు విజయ్ సేతుపతిపై ఒక పాట చిత్రీకరణ చేసేందుకు గాను అందులోనే ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సేతుపతితో పాటు, కొందరు ముఖ్య నటీనటులకు సంబంధించిన సీన్స్‌ను ఆ సెట్‌లోనే చేయబోతున్నారట. సాధారణంగా పూరి తన సినిమాలకు సంబంధించిన సెట్స్‌కి కాస్త తక్కువ ఖర్చు చేస్తారు అనే టాక్ ఉంది. అలాంటి పూరి ఈ సినిమా కోసం అత్యధికంగా ఖర్చు చేసి మరీ సెట్ నిర్మాణం చేయిస్తున్నారు అంటే సినిమాలో ఆ సెట్ ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన నిర్మాతగా ఈ సినిమాను చేస్తున్నారు. కనుక కథకు తగ్గట్లుగా, సీన్స్ డిమాండ్ మేరకు ఆ భారీ సెట్టింగ్ ల నిర్మాణం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సెట్‌లో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సినిమా ను తమిళ్‌లోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తమిళ ఆడియన్స్ కోసం కొన్ని సీన్స్ ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఛార్మి వ్యవహరిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాతో పూరి పూర్వ వైభవం కి వస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం పూరి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పూరి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గుతున్నాయి. అందుకే ఈ సినిమాతో తన పూర్వ వైభవంను దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.