పులివెందుల జెడ్పీటీసీ వైసీపీకి ఇబ్బందికరంగా మారింది అని చెప్పాలి. ఈ ఉప ఎన్నిక వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒంటిమిట్ట జెడ్పీటీసీది అయితే అనివార్యం అనుకున్నారు. అక్కడ జెడ్పీటీసీగా ఉన్న నాయకుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి. కానీ పులివెందుల వ్యవహారం వేరు. జెడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. న్యాయంగా అయితే ఆ కుటుంబానికి సానుభూతితో వదిలేయాలి. కానీ వైసీపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం ఉంది. అందుకే ఉప ఎన్నిక తోసుకొచ్చింది.
మొత్తం 19 నామినేషన్లు :
ఇక పులివెందుల జెడ్పీటీసీలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసేటప్పటికి 19 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇక ఇండిపెండెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. వారికి గుర్తుకు కేటాయిస్తారు చిత్రంగా కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. టీడీపీ నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ కుమారుడు పోటీలో ఉన్నారు. అదే విధంగా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ సైతం మా సీటు అని పోటీ పడుతోంది.
ఓట్లు చీలిక భయం :
మొత్తం పది వేల దాకా ఓట్లు ఉన్న పులివెందుల బరిలోకి కాంగ్రెస్ వచ్చి చేరింది అంతే కాదు వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. వీరి వల్ల వైసీపీ ఓట్లకు ఎంతో కొంత గండి పడే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికను ప్రతిష్టగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీసుకుంటున్నారు. దాంతో వైఎస్ వివేకా కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఇంకో వైపు చూస్తే పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసుని మరోమారు జనంలో పెట్టి రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టాలని ప్రత్యర్ధులు పధక రచన చేస్తున్నారు అని అంటున్నారు.
అధికార బలం ముందు :
ఇదిలా ఉంటే టీడీపీకి అధికార బలం ఉంది. రాష్ట్ర స్థాయి నుంచి పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి. లక్కీగా చాన్స్ వచ్చింది. జగన్ సొంత ఇలాకాలో పులివెందులలో పసుపు జెండా ఎగరేసి ఆ పార్టీ కూసాలు కదిలించాలన్నది కూటమి పెద్దల ప్లాన్ గా ఉంది. దాంతో పదునైన వ్యూహాలను కూడా ఖరారు చేస్తున్నారు. వైసీపీ మద్దతుదారులను వెంట ఉండే చిన్న నాయకులకు ఎర వేసి తప వైపు తిప్పుకునే రాజకీయ క్రీడ అయితే మొదలైంది అని అంటున్నారు. వైసీపీ వీటిని తట్టుకుని పోరాడాల్సి ఉంది.
వ్యూహాల లేమితో బోల్తానే :
ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ పరం అవుతుంది అని అంటున్నారు. ఏ మాత్రం వ్యూహాలలో తప్పుగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు పులివెందులలో టీడీపీ పోటీ వల్ల లాభమే కానీ పోయేది ఏమీ లేదు. ఓటమి చెందితే అది మా సీటు కాదు అని చెప్పుకోవచ్చు. గెలిస్తే రాజకీయ సంచలనానికి తెర తీయవచ్చు. ఏకంగా జగన్ సొంత కోటానే బద్ధలు కొట్టామని స్టేట్ మొత్తానికి ఒక ఇంప్రెషన్ ని ఇవ్వవచ్చు. అదే వైసీపీకి అయితే ప్రాణ సంకటమే. గెలవడం అనివార్యం. తేడా కొడితే మాత్రం అది నేరుగా వైసీపీ అధినాయకత్వానికి ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ నెల 12న జరిగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు కేవలం వారం మాత్రమే గడువు ఉంది. మరి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.