మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో 12వ తేదీన జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. సొంత ఇలాకాలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో మాజీ సీఎం జగన్ పులివెందులలో ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఈ రోజు కూడా ఆయన పర్యటన లేకపోవడంతో పులివెందుల గెలుపు బాధ్యత మొత్తం కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై పడింది. పులివెందులలో ఎన్నిక జరుగుతున్నా, హోరాహోరీ పోరు నెలకొన్నా స్థానిక ఎమ్మెల్యే అయిన జగన్.. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కే పరిమితమయ్యారు. దీంతో ఆయన తీరుపై విస్తృత చర్చ జరుగుతోంది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వ్యక్తిగతంగా జగన్ కి, ఆయన పార్టీ వైసీపీకి చాలా ముఖ్యం. అయినా జగన్ పర్యటించకపోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. వ్యూహాత్మకంగానే జగన్ పులివెందులలో పర్యటించలేదని విశ్లేషిస్తున్నారు. పులివెందుల గెలుపు అనివార్యమైనా తాను ప్రచారం చేస్తే మరింత ప్రాధాన్యం ఏర్పడుతుందని, అప్పుడు ఫలితం తప్పక అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఫలితం బెడిసికొడితే రాజకీయంగా తీరని నష్టమని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే వ్యూహాత్మకంగా జగన్ ప్రచారానికి దూరంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు.
సుమారు వారం రోజుల పాటు ఎన్నిక ప్రచారం జరిగింది. కానీ, జగన్ కానీ, ఆయన సతీమణి కానీ ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. రాజకీయ ప్రత్యర్థి టీడీపీ ఎంతలా కవ్వించినా, జగన్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ కవ్వింపులతో ప్రచారానికి వచ్చి ఉప ఎన్నికకు రాష్ట్రవ్యాప్తంగా మరింత ప్రచారం కల్పించడం అనవసరమన్న భావనతోనే జగన్ బెంగళూరులో ఉండిపోయారని అంటున్నారు. ఇదే సమయంలో జిల్లా పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశిస్తున్నారని అంటున్నారు. ప్రచారానికి దూరంగా ఉండిపోవాలని జగన్ నిర్ణయించుకోవడంతో ఆయన రాకుండానే ప్రచార గడువు ముగిసింది. మరోవైపు రెండు రోజుల తర్వాత జరిగే పోలింగ్ రోజున అయినా జగన్ వస్తారా? రారా? అన్న సందేహం నెలకొంది. అయితే ఈ ఎన్నికలో ఓటు వేసే అవకాశం లేకపోవడంతో జగన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.
పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతున్నా, మాజీ సీఎం జగన్ ఓటు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉంది. దీంతో జడ్పీటీసీ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసే అవకాశం లేదు. దీంతో ఎన్నిక ముగిసిన తర్వాతే జగన్ పులివెందుల వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఉప ఎన్నిక బాధ్యతను తన భుజస్కందాలపై మోస్తున్నారు. జిల్లాలో ఇతర సీనియర్ నేతలతో ఆయన ఒక్కరే పార్టీ తరఫున ప్రచారం చేశారు. స్థానిక వైసీపీ నేత, ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి కూడా వైసీపీ తరుపున పోరాడుతున్నారు.