ఏపీలో ప్రజాస్వామ్యం లేదని పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ఏపీలో అధికార టీడీపీ విపక్ష వైసీపీ రెండూ దొందుకు దొందే అని ఆమె తేల్చేశారు. పులివెందులకు రిటర్న్ గిఫ్ట్ దక్కిందని కూడా అన్నారు. ఆనాడు వైసీపీ అధికారంలో ఉండగా కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదా అని ప్రశ్నించారు. దానికి బదులుగా ఇపుడు పులివెందులలో జరిగిందని అన్నారు.
ఏపీలో పేరుకు వేరు వేరు పార్టీలుగా ఉన్నా అందరూ మోడీ కూటమిలోనే ఉన్నారు అని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి లోక్ సభలో పాతిక మంది ఎంపీలు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారని అయినా ఏపీ ప్రయోజనాల విషయంలో ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు చంద్రబాబు బీజేపీతో ఓపెన్ గా పొత్తు పెట్టుకుంటే జగన్ లోపాయికారీగా కూటమి కట్టారని నిందించారు. వీరంతా మోడీని ఏమీ అనలేరని కూడా విమర్శించారు.
ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ అని ఆమె అంటున్నారు. ప్రజాస్వామ్యం ఏపీలో లేదని దేశంలోనూ లేదని అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద పెద్ద బాధ్యతను భుజాన వేసుకుని దేశం కోసం పనిచేస్తున్నారు అన్నారు. ఏపీలో రెండు పార్టీల వల్ల జరిగేది ఒరిగేది లేదని అన్నారు ప్రజాస్వామ్యం కావాలంటే కాంగ్రెస్ నే జనాలు ఆదరించాలని ఆమె కోరారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఏపీకి కావాలా అన్న చర్చ కూడా నెటిజన్లు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చవద్దని ఏపీకి చెందిన వారంతా ముక్తకంఠంతో కోరుకుంటే కాదని అడ్డగోలు విభజన చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతు వినడమే కదా అని అంటున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయం తీసుకున్నా విభజన హామీలలో చేర్చలేదు కదా అని గుర్తు చేస్తున్నారు నోటి మాటగా చెప్పారని అందుకే హోదా ఏపీకి దక్కలేదని అంటున్నారు. ప్రజాస్వామ్యం విషయంలో కాంగ్రెస్ కి ఒక మార్క్ ఉందని గతంలో ఉమ్మడి ఏపీలో జనాలు చూసినదే అంటున్నారు.
ఏపీలో గడచిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ని జనాలు ఓడించి పక్కన పెట్టడానికి కారణం విభజన పాపాలూ శాపాలను ప్రజలు ఇంకా అనుభవించడమే అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో జనాలకు ఏమి చెబుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రజలు అన్ని విషయాలు మరచిపోయారని కాంగ్రెస్ నేతలు భావిస్తే మాత్రం ప్రజాస్వామ్యం గురించి ఎన్ని అయినా లెక్చర్లు ఇవ్వవచ్చు అంటున్నారు. అలా కాకుండా జనం మనోభావాలను ఇప్పటికైనా గమనించి కాంగ్రెస్ వ్యవహరిస్తే ముందుగా విభజన పాపాలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఏపీ విషయంలో ఏమైనా మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు.