టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో వీరమల్లుగా కనిపించారు. తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు.
సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ లైనప్ లో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వరిస్తూనే పవన్.. సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. అదే సమయంలో మరో కొత్త మూవీని ఇప్పటి వరకు సైన్ చేయలేదు. చేస్తారో లేరో కూడా తెలియదు. ఆ విషయంపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. నిర్మాతగా సినిమాలు తీస్తానని మాత్రం వీరమల్లు ప్రమోషన్స్ లో తెలిపారు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో కొత్త అప్డేట్ షికారు చేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల విషయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫుల్ గా ఫోకస్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే.
పవన్ రీసెంట్ మూవీస్ లో ఆయన పాత్ర ఉంది. ఇప్పుడు కొత్త మూవీస్ ను పర్యవేక్షించే బాధ్యత కూడా ఆయనదేనని సమాచారం. రెండు- మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు దర్శకులు, రెండు స్క్రిప్ట్ లు రెడీ అయ్యాయని సమాచారం. అందులో ఒకటి రీమేక్ మూవీ అని టాక్. త్రివిక్రమ్ తో సన్నిహిత బంధం ఉన్న టాలీవుడ్ నిర్మాతలు ఆ రెండు ప్రాజెక్టులను రూపొందిస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే 2027లో మళ్లీ పవన్ కొత్త సినిమాల్లో నటిస్తారని కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో వేచి చూడాలి.