సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా పరిచయం అవసరం లేదు. వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలో నటించింది. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ప్రీతి పూర్తిగా బాలీవుడ్ లో సెటిలైంది. అక్కడ పదేళ్ల పాటు కెరీర్ బెస్ట్ గా సాగింది. కానీ అనూహ్యంగా ప్రీతి అవకాశాలను కోల్పోయింది.
ఆ తర్వాత విదేశీ ప్రియుడు జీన్ గూడెనఫ్ ని పెళ్లాడిన ప్రీతి జింతా సరోగసీ విధానంలో మమ్మీ అయింది. కొన్నేళ్లుగా పిల్లల ఆలనా పాటనా చూస్తోంది. మరోవైపు ప్రీతి ఎంటర్ ప్రెన్యూర్ గాను రాణిస్తోంది. ప్రీతి భాగస్వాములతో కలిసి ఐపీఎల్ ఫ్రాంఛైజీలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రీతి నటించిన క్లాసిక్ మూవీ ‘కల్ హో నయ హో’ని రీరిలీజ్ చేయగా అది థియేటర్లలో ఎమోషన్ ని రగిలిస్తోంది.
రిలీజైన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ‘కల్ హో నా హో’ ఇప్పటికీ ప్రేక్షకుల్లో బలమైన భావోద్వేగాన్ని రాజేస్తోంది. ఈ మూవీ అద్భుతమైన కథాంశం, చక్కని నట ప్రదర్శనల కారణంగానే కాకుండా ఆద్యంతం ఉద్వేగానికి గురి చేసే సన్నివేలతో సినిమా రక్తి కట్టిస్తుంది. ఇందులో షారూఖ్ అమన్ మాథుర్ అనే పాత్రలో నటించాడు. ఎన్నారై గాళ్ నైనా కేథరీన్ పాత్రలో ప్రీతి నటించింది. నేను కల్ హో నా హో చూసిన ప్రతిసారీ, చిన్నపిల్లలా ఏడుస్తాను. నైనా కేథరీన్ కపూర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రేమ అంటే కొన్నిసార్లు వదిలేయడం అని ఒక పాఠం నేర్చుకున్నాను! అని ఒక అభిమాని సినిమాను ఉద్ధేశించి రాశాడు.
దానికి ప్రతి స్పందించిన ప్రీతి ఎమోషనల్ అవుతూ..అవును, నేను ఈ సినిమా చూసినప్పుడు ఏడుస్తాను.. ఈ సినిమాని చిత్రీకరిస్తున్నప్పుడు కూడా నేను ఏడ్చాను! నా మొదటి ప్రేమికుడు కారు ప్రమాదంలో మరణించాడు. కాబట్టి ఈ చిత్రం ఎల్లప్పుడూ భిన్నంగా అనిపించింది. సరదాగా సాగుతూనే, వాస్తవం తెరపై కనిపిస్తుంది. చాలా సన్నివేశాలలో.. అందరు నటులు సహజంగా ఏడ్చారు. అమన్ (షారూఖ్) మరణ సన్నివేశం ప్రతి ఒక్కరినీ ఏడ్పించింది! అని గుర్తు చేసుకుంది. షారూఖ్, సైఫ్ అలీ ఖాన్ ఈ రొమాంటిక్ డ్రామాలో నటించగా, నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ నిర్మించారు. ఇందులో షారూఖ్ పాత్ర చివరిలో చనిపోతూ ఎమోషన్ ని రగిలిస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తారని ప్రచారం సాగుతోంది. కానీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.