“నాతో పాటు ఆ ఇద్దరు నటీమణులు పెళ్లికి ముందు గర్భవతి అని పిలిపించుకున్న వారి జాబితాలో ఉన్నారు!“ అని వ్యాఖ్యానించారు నేహా ధూపియా. ఈ సీనియర్ నటి అకస్మాత్తుగా నటుడు అంగద్ భేడీని పెళ్లాడారు. ఆ తర్వాత ఆరు నెలలకే బిడ్డను ప్రసవించారు. ఈ వ్యవహారంపై సహజంగానే చాలా కామెంట్లు వినిపించాయి. పెళ్లికి ముందే గర్భవతి అయిన నటీమణి అనే కామెంట్లు శ్రుతి మించాయి. అయితే అప్పటికి నేహా దీనిని అంతగా పట్టించుకోలేదు. కానీ లోలోన మదనపడిన విషయం ఇప్పుడు బయటపెట్టింది.
కనీసం పెళ్లికి ముందు గర్భవతి అయిన వారి జాబితాలో నేను, నీనా గుప్తా, ఆలియా ఉన్నామని నేను అనుకుంటున్నాను.. ప్రజలు మారలేదు.. ఇలాంటి వ్యాఖ్యలు హాస్యాస్పదం… అని అన్నారు. ఇటీవల మిడ్-డేతో ఇంటర్వ్యూలో నేహా మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న విమర్శలను ప్రస్తావించింది. అంగద్ నేను పెళ్లి చేసుకున్నాము. మా పెళ్లి చుట్టూ చాలా గుసగుసలు వినిపించాయి. ముఖ్యంగా ఆరు నెలల్లో బిడ్డ ఎలా వచ్చింది? అంటూ మాట్లాడుకున్నారు. ఇలాంటి కామెంట్లు ఎప్పుడూ వింటూనే ఉంటాము. కానీ వాటిని తేలిగ్గా తీసుకోవాలని నేర్చుకున్నాను! అని తెలిపారు నేహా ధూపియా. స్త్రీల ఆరోగ్యం, గర్భం, ప్రసవానంతర జాగ్రత్తలపై తాను మాట్లాడాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం ఈ కామెంట్లేనని కూడా అన్నారు నేహా. ఇప్పటికీ పెళ్లికి ముందు గర్భవతి అయ్యే నటీమణుల గురించి స్టోరీలు వేయడం, ట్యాగ్‌లు జోడించడం నేను చూస్తున్నాను. ఇది చాలా హాస్యాస్పదం అని అన్నారు.
మేటి బాలీవుడ్ కథానాయిక నీనా గుప్తా పెళ్లికి ముందే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనంలో మసాబా గుప్తాకు జన్మనిచ్చారు. అలాగే ఆలియా భట్ ని రణబీర్ పెళ్లాడిన అదే ఏడాదిలో కుమార్తె రాహాను స్వాగతించడంపై చాలా గుసగుసలు వినిపించాయి. పెళ్లికి ముందే నీనా, ఆలియా గర్భిణులు అనే కామెంట్లు వినిపించిన విషయాన్ని గుర్తు చేసారు నేహా ధూపియా. మీరు ఇలానే ట్రోల్ చేస్తుంటే, అలానే ఉండండి.. మేం వాటిని పట్టించుకోవడానికి సిద్ధంగా లేము అని నేహా అన్నారు. నేహా ధూపియా టాలీవుడ్ లో `పరమ వీర చక్ర` అనే దేశభక్తి చిత్రంలో యాక్షన్ పాత్రలో నటించారు. ఇందులో బాలకృష్ణ కథానాయకుడు. దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. జూలీ అనే రొమాంటిక్ చిత్రంలో నేహా రెచ్చిపోయి నటించగా, ఈ సినిమాలో నటనకు యువతరంలో గొప్ప గుర్తింపు దక్కింది. నేహా ఇటీవల బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా బిజీ అయ్యారు.