అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు ముంత మామిడి పండు అన్నాడు అన్నట్టుగా తయారైంది దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఈజీగా పార్టీలను గెలిపించి సీఎంలను చేసిన ఘనత పీకేది.. నరేంద్రమోదీ, జగన్, స్టాలిన్, మమత సహా ఎంతో మంది ముఖ్యమంత్రులు కావడానికి కారణం పీకేనే. అలాంటి పెద్దమనిషి ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను.. గెలుస్తాను.. సీఎం అవుతానన్న పీకే ఇప్పుడు పోటీకే భయపడుతున్నాడన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
బీహార్ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా “వ్యూహకర్త”గా గుర్తింపు తెచ్చుకున్న పీకే, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, జగన్, నితీశ్ కుమార్ వంటి నేతలకు ఎన్నికల వ్యూహాలను అందించి విజయాన్ని అందించిన ఆయన బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను.. గెలుస్తాను.. సీఎం అవుతాను అని గట్టిగా ప్రకటించారు.
మొదట బీహార్‌లో స్వతంత్రంగా పోటీ చేస్తానని, “జన్ సురాజ్” పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెడతానని ప్రకటించిన ఆయన, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయట్లేదు.
తాజాగా, పీకే పోటీకి దూరంగా ఉండటమంటే ఆత్మవిశ్వాసం కంటే భయం ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తోంది. “నేను పోటీ చేస్తే పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించలేను” అనే ఆయన వాదనను చాలామంది న్యాయమైనదిగా కాకుండా ఓ సాకుగా చూస్తున్నారు.
నిజానికి, బీహార్ రాజకీయాల సత్యం ఏమిటంటే అక్కడ ప్రాంతీయ కులపరమైన గణాంకాలే నిర్ణాయకం. ఆ క్రమంలో పీకేకు పెద్దగా సామాజిక ఆధారం లేదు. ఆయనపై ఉన్న మేధోమతిమైన “ఇమేజ్”తో ఓటర్లు ఆకర్షితులు కావడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి భయంతోనే ఆయన ఈ సారి పోటీని తప్పించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.
పోటీ చేయకపోయినా, పీకే మాటల్లో ధైర్యం మాత్రం తగ్గలేదు. “మా పార్టీ 150 సీట్లు గెలుస్తుంది” అనే ఆయన వ్యాఖ్య వాస్తవానికి చాలా దూరంగా ఉందని చెప్పాలి. బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ ఈ మూడు పార్టీలే ప్రధాన బలంగా ఉన్న సందర్భంలో కొత్త పార్టీకి కనీసం 10 సీట్లు కూడా రావడం కష్టమనేది స్థానిక అంచనా.
అయితే, పీకే చేసిన మరో వ్యాఖ్య “నీతీశ్ మళ్లీ సీఎం కాలేరు” మాత్రం బీహార్ రాజకీయ వాతావరణంలో ఆసక్తికరంగా మారింది. జేడీయూ క్షీణిస్తున్న పరిస్థితి, ఎన్డీయేలో ఉన్న విభేదాలు.. ఇవన్నీ ఆయన మాటలకు కొంత బలం ఇస్తున్నాయి. కానీ, అదే సమయంలో ఆయన పార్టీ ‘జన్ సురాజ్’ నిజంగా ప్రజల్లో స్థిరపడిందా? అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించట్లేదు.
మొత్తం చూస్తే, పీకే రాజకీయ పయనం ఇప్పటికీ ఒక “పరీక్షా దశ” లోనే ఉంది. వ్యూహకర్తగా మెప్పించిన ఆయన నాయకుడిగా ప్రజలను ఆకట్టుకుంటారా? లేదా రాజకీయాలకు పనికిరాని “తుస్సుమనిపించిన వ్యూహకర్త” గానే మిగిలిపోతారా? అన్నది ఈ ఎన్నికల తర్వాతే తేలనుంది.
ప్రశాంత్ కిశోర్ పోటీ చేయకపోవడం ఆయన రాజకీయ ధైర్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది వ్యూహాత్మక నిర్ణయమా లేక భయపడ్డ అడుగా అనే అంశం బీహార్ ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంది.