పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. రెండు సినిమాలు సెట్స్ పై ఉండగా ఆ రెండు పూర్తైన తర్వాత సాలిడ్ లైనప్ తో ఉన్నారు ప్రభాస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ తో పాటూ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్, ముందుగా ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు.
రాజా సాబ్ సినిమాపై ఇప్పుడైతే అంచనాలున్నాయి కానీ అసలు సినిమా మొదలుపెట్టినప్పుడు దీనిపై ఏ మాత్రం అంచనాల్లేవు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అసలు ఈ సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో తమ హీరోను ఎంతో వేడుకున్నారు కూడా. కానీ ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మి అవకాశమిచ్చారు. ప్రభాస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేలా మారుతి కూడా రాజా సాబ్ కు ది బెస్ట్ ఇస్తూ వస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా వింటేజ్ లుక్ లో చూపించి అందరినీ ఇంప్రెస్ చేసిన మారుతి, మొన్నా మధ్య టీజర్ తో మిగిలిన వారిని కూడా ఎట్రాక్ట్ చేశారు. వాస్తవానికి రాజా సాబ్ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోవడంతో రిలీజ్ లేటవుతూ వచ్చింది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు మేకర్స్. కాగా రాజా సాబ్ లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజా సాబ్ మ్యూజిక్ కు సంబంధించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయని, అందులో మొదటిది ప్రభాస్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ కాగా, రెండోది ఒక రొమాంటిక్ మెలోడీ అని తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్లతో ఓ మాస్ సాంగ్ ను మారుతి ప్లాన్ చేయగా, మాళవిక మోహనన్ తో మరో మాస్ సాంగ్ తో పాటూ రాజా సాబ్ థీమ్ సాంగ్ కూడా ఉండనుందని, ఈ సాంగ్స్ అన్నింటినీ తమన్ నెక్ట్స్ లెవెల్ లో కంపోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.