ఆయన దేశానికి ప్రధానమంత్రి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపించే సారధి. మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. గత పదకొండేళ్లుగా దేశాన్ని ఏలుతున్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ ఆ తరువాత శ్రీమతి ఇందిరాగాంధీ తరువాత అత్యధిక కాలం దేశాన్ని పాలించిన నేతగా మోడీ రికార్డు సృష్టించారు. బలమైన నాయకుడిగా నిలిచారు. జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో పేరు సంపాదించారు. అయితే మోడీ విషయంలో ప్రతిపక్షాలు కొన్ని అడుగుతున్నాయి. వాటి మీద ఆయన పారదర్శకంగా ఉండాలని కోరుతున్నాయి.
మోడీ విద్యార్హతల విషయం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి చూస్తే ఇది ఈనాటి డిమాండ్ కాదు, చాలా ఏళ్ళ నాటి డిమాండ్. ఇక తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ విషయం చర్చకు వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన డిగ్రీ వివరాలు ఏవీ బయట పెట్టాల్సిన అవసరం లేదని ఢిలీ హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది.
సెటైరికల్ గా ఇపుడు మోడీ డిగ్రీ విషయంలో విపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఒక విపక్ష ఎంపీ అయితే తన డిగ్రీని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇదీ నా డిగ్రీ వివరాలు మరి మీవి కూడా పెట్టవచ్చుగా అంటూ మోడీకి సెటైరికల్ గా విన్నపాలు చేశారు. ఇపుడు సినీ నటుడు ప్రకాష్ రాజ్ వంతు గా ఉంది. ఆయన కూడా ఒక సెటైరికల్ గా న కామెంట్స్ చేశారు.
తనకు డిగ్రీ లేదని ఆయినా సిగ్గుపడను అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తాను ఎక్కడా ఆ విషయాలను దాచుకోనని కూడా చెప్పుకొచ్చారు. భారత పౌరులకు అలాగే ప్రధానమంత్రికి బహిరంగ లేఖ అంటూ మొదలెట్టిన ఆయన నేను ప్రకాశ్ రాజ్‌ను. నాకు డిగ్రీ లేదు. నా సృజనాత్మక వృత్తి కోసం చదువును మధ్యలోనే ఆపేశాను. దీనికి నేను సిగ్గుపడటం లేదు. దీన్ని దాచుకోవాలని కూడా అనుకోవడం లేదు అని ముగించారు. ఆ పోస్టుని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ఎవరైనా తమ వ్యక్తిగతం అనుకున్నపుడు అది ప్రైవేట్ లైఫ్ లోనే సాధ్యపడుతుంది. కానీ వారు ఒక్కసారి పబ్లిక్ లైఫ్ లోకి వస్తే వారికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అంతా అడుగుతారు. అది వారి హక్కు అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. ఆయన అన్నారు అని కాదు కానీ ప్రజాస్వామ్యంలో మన ఏలికల గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే వారికి ఇష్టం లేదు అన్నపుడు ఒత్తిడి చేయడం కూడా ప్రజాస్వామ్యం అనిపించుకోదు అంటారు.
ఇక మోడీ విద్యార్హతల విషయంలో వివాదం ఎక్కడ మొదలైంది అన్నది చూస్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏ డిగ్రీకి సంబంధించిన వివరాలను బయటపెట్టాలని ఢిల్లీ యూనివర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ 2016లో ఆదేశాలను జారీ చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఒక పిటిషనర్ ఈ వివరాలని కోరారు. దాని మీద కేంద్ర సమాచార కమిషన్ అలా స్పందించింది. అయితే ఆ విషయంలో సమాచార కమిషన్ ఆదేశాలను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సచిన్ దత్తా తీర్పును వెలువరించారు.
వికీపీడియాలో చూస్తే కనుక నరేంద్ర మోడీ 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే బీఏ డిగ్రీని పొందారు. 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎమే డిగ్రీని పొందారు, అలా దూరవిద్య విద్యార్థిగా మొదటి తరగతిలో పట్టభద్రుడయ్యారని ఆయన విద్యార్హత వివరాలలో ఉంది అయితే ఆయన పొందిన డిగ్రీల విషయం మీద విపక్షాలు చాలా కాలంగా రాద్ధాంతం చేస్తున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో మరోసారి బిగ్ డిబేట్ గా ఈ ఇష్యూ మారుతోంది.