జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలలో కంపెనీలకు లేదా వ్యక్తులకు లేదా పార్టీలకు ఇచ్చిన సలహాల ద్వారా రూ. 241 కోట్లు సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో దాదాపు రూ. 31 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లు తెలిపారు. ఇది తన ఆదాయంలో 18 శాతమని ఆయన వెల్లడించారు.
రూ. 20 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించానని, అలాగే జన్ సురాజ్ పార్టీకి రూ. 98.95 కోట్లు విరాళంగా ఇచ్చానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను ఇతరుల మాదిరిగా దొంగను కాదని ఆయన అన్నారు. తనకు డబ్బులు ఎలా వచ్చాయో, వాటిని ఏ విధంగా ఖర్చు చేశానో స్పష్టంగా చెప్పగలనని అన్నారు. తాను గతంలో పార్టీలకు, వ్యక్తులకు సలహాలు ఇచ్చినందుకు ఎలాంటి రుసుము వసూలు చేయలేదని, రాజకీయాల్లోకి ప్రవేశించాక తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ రాజకీయ ప్రచారాలకు డబ్బు ఎక్కడి నుండి వస్తోందని బీహార్‌లోని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ నాయకుడు సంజయ్ జైశ్వాల్ పలుమార్లు ప్రశాంత్ కిశోర్ ఆదాయ వనరుల గురించి నిలదీశారు. కాగా, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేయనుంది. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.