రూ.లక్ష కోట్లతో కొత్త పథకం.. సామాన్యులకు డబుల్ దీపావళి.. మోదీ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ కొత్త పథకం ప్రారంభించారు. రూ.లక్ష కోట్లతో యువత కోసం పీఎం వికసిత్ భారత్ యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్రజలకు దీపావళి కానుక అందిస్తామన్నారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి.. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు.
దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం ప్రారంభించారు. దీనికి ప్రధాన మంత్రి వికసిత్ భారత్ యోజన అని పేరు పెట్టినట్లు చెప్పారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు రూ.15వేలు అందించనున్నట్లు తెలిపారు. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్ని విషయాల్లో ఆత్మనిర్భర్ లక్ష్యమని మోదీ అన్నారు. దేశ ప్రజలకు దీపావళీ కానుక ఇస్తామని మోదీ తెలిపారు. ఈసారి డబుల్ దీపావళి అందిస్తామన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామన్నారు. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా..రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సంస్కరణల విషయంలో ప్రజలు తమకు మద్దతు పలకాలని మోదీ కోరారు.
పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఉత్పత్తులను లక్షల కోట్లు పెట్టి కొనాల్సి వస్తోందని మోదీ అన్నారు. ఇంధనం విషయంలోనూ ఆత్మనిర్భర్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అది సాధ్యమైతే ఆ డబ్బు దేశాభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చన్నారు. బడ్జెట్‌లో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులకే ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆ ధనాన్ని చమురు దిగుమతుల కోసం విదేశాలకు చెల్లించాల్సి వస్తోందని.. సముద్ర మంథన్ ద్వారా సముద్రంలో చమురు నిక్షేపాలు వెలికితీస్తున్నట్లు చెప్పారు. ఫర్టిలైజర్ల విషయంలో విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని మోదీ అన్నారు. ‘‘ఫర్టిలైజర్ల వినియోగంతో భారత భూమాతను కూడా ఇబ్బందిపెడుతున్నాం. దేశంలో యువత, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నా. భూమికి నష్టం కలిగించకుండా ఫర్టిలైజర్లు తయారుచేద్దాం రండి’’ అని మోదీ పిలుపునిచ్చారు.
మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నారని మోదీ అన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాలతో వస్తే అండగా ఉంటానని అన్నారు. నిబంధనల వల్ల దేశాభివృద్ధి ఆగిపోకూడదని.. అవసరమైతే ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తామన్నారు. ప్రపంచ మార్కెట్‌కు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలన్నారు. ధర తక్కువ.. నాణ్యత ఎక్కువ ఉండాలని సూచించారు. ఈ నినాదంతో ముందుకెళ్తే.. మనదే విజయమని స్పష్టం చేశారు.
10 ట్రిలియన్ భారత్ కోసం..
2047 నాటికి దేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి, పాలనను ఆధునీకరించడానికి ఒక ప్రత్యేక సంస్కరణ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో జనాభా అసమతుల్యత దేశ భద్రతకు సవాలుగా మారుతోందని పేర్కొంటూ.. దీనిని పరిష్కరించడానికి ఒక ‘హై-పవర్డ్ డెమోగ్రఫీ మిషన్’ను ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్‌లను, డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐను ఎలా అభివృద్ధి చేసుకున్నామో.. అలాగే జెట్ ఇంజిన్ల విషయంలోనూ స్వయం సమృద్ధి సాధించాలని, శాస్త్రవేత్తలు, యువత ఈ సవాల్‌ను స్వీకరించాలని మోదీ పిలుపునిచ్చారు.