అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటితోనే నవ్వుతున్నారు. కానీ నొసటితో వెక్కిరిస్తున్నారు. నిన్నటికి నిన్న భారత్ మంచి మిత్ర దేశం అన్నారు. మోడీ తనకు జిగినీ దోస్త్ అని చెబుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇపుడు చూస్తే వీసాల వడ్డింపుతో భారతీయుల నడ్డి విరిచారు. ఏకంగా హెచ్-1బీ వీసాల ఫీజుని అతి పెద్ద మొత్తంగా చేశారు. అమెరికా ఫస్ట్ అన్న సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్తున్న ట్రంప్ లక్ష డాలర్లు అంటే భారతీయ విలువలో 88 లక్షల రూపాయలు అన్న మాట. అలా చెల్లించిన వారికే చెల్లించిన వారికే హెచ్-1బీ వీసా జారీ చేసేలా కఠిన చర్యలు తీసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక బలమైన నినాదాన్ని అందుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అని ఆయన తాజాగా జరిగిన పలు కార్యక్రమాలలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. షిప్ అయినా చిప్ అయినా దేశంలోనే తయారు చేయాలి. విదేశాలకు ఎందుకు అని ఆయన గట్టిగానే ప్రశ్నించారు. ఇతర దేశాల మీద ఆధారపడే విధానం పోవాలని అన్నారు అంతే కాదు మన మేధస్సు మనకే ఉపయోగపడాలని ఆయన కోరుకుంటున్నారు.
భారత్ కి అతి పెద్ద శత్రువు భారత్ అని అన్నారు. మనం ఇతర దేశాల వైపు చూస్తున్నామని ఆయన చెబుతూ ఇక మీదట ఆ పరిస్థితి మారాలని ఆయన కోరారు గుజరాత్ లో 34 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మేధో వలసలు కాకుండా భారత్ లోనే అంతా ఉంటూ దేశాభివృద్ధికి కృషి చేయాలన్న సందేశాన్ని కూడా ఆయన ఇస్తున్నారు. అతి పెద్ద మానవ వనరులు ఉన్న దేశంగా భారత్ ఉందని ఆయన గుర్తు చేశారు.
భారత్ తన భవిష్యత్తును తానే నిర్దేశిస్తుందని తానే ఆ దిశగా మంచి మార్గం వేసుకుంటూ ముందుకు సాగుతుందని మోడీ అన్నారు. ఇతరులకు అప్పగించి కూర్చోవడం ఇక మీదట జరగదని ఆయన అన్నారు. భారత్ తన డబ్బుతో ఇతర దేశాలకు సంపదను ఇస్తోంది అని గ్యాస్ తో పాటు ముడి చమురు వంటి వాటిని ఈ రోజుకీ దిగుమతి చేసుకోవడం వల్ల అనేక దేశాలు బాగుపడుతున్నాయని అది ఇప్పటికైనా ఆగాలని కోరారు. ఏటా లక్షల కోట్ల రూపాయలను ఇతర దేశాలకు భారత్ చెల్లిస్తూ వారిని ఆర్ధికంగా శక్తిమంతులను చేస్తోంది అని ఆయన గుర్తు చేశారు. అదే భారత్ స్వావలంబన ప్రతీ రంగంలో సాధిస్తే ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంటుందని అన్నారు. ఇపుడు ఇంధనం విషయంలో స్వావలంబన సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మోడీ చెప్పారు.
మోడీ తాజా వ్యాఖ్యలు ఇపుడు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. చాలా దశాబ్దాలుగా భారత్ నుంచి మేధో వలస పోతోంది. వారు ఇతర దేశాలలో ఉంటూ అక్కడ దేశాలను సంపన్నవంతం చేస్తున్నారు. అయితే అది ఇపుడు మారి రివర్స్ లో భారత్ తానే అభివృద్ధి చెందాలని మోడీ గుజరాత్ గడ్డ మీద నుంచి కోరుకున్నారు. వీసాల భారంతో లక్షలు చెల్లించి ఇతర ప్రాంతాలలో ఉండే బదులు స్వదీశీ నినాదంతో దేశంలోనే ఉంటూ భారత్ ని అభివృద్ధి చేసుకోవాలని మోడీ పరోక్షంగా ఒక గట్టి సందేశం ఇచ్చారు. ఇంకో వైపు అంతర్జాతీయ నిపుణులు మేధావులు సైతం వీసాల పెంపు మీద అమెరికాని విమర్శిస్తున్నారు. ప్రతిభకు తలుపులు మూసి అమెరికా సాధించింది ఏమీ ఉండదని ఇది భారత్ మరింతగా దూసుకుపోవడానికి అభివృద్ధి చెందడానికి చోదకశక్తిగా మారుతుందని కూడా అంటున్నారు. మొత్తానికి ట్రంప్ దూకుడుకు మోడీ తనదైన గిఫ్ట్ ని ఇచ్చే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు.